18, మార్చి 2018, ఆదివారం

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?


జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లికట్టు ఆట నిషేధానికి కేంద్ర స్థాయిలో నిషేదాజ్ఞలు జారీ అయ్యాయి.  పర్యవసానం ఏమయ్యింది..?  తమిళ ప్రజలంతా  ఒక్కటయ్యారు.  చంటి పిల్లలు మొదలుకొని సెలబ్రిటీల వరకు, సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు అందరూ ఏకమయ్యారు.  తమ సంప్రదాయ క్రీడ పై నిషేధం విధిస్తే..  అది తమ సంస్కృతి, సంప్రదాయాల మీద జరిగిన దాడిగానే భావించవలసి వుంటుందని అంతాకలసి రాష్ట్రాన్నే స్థంబింపజేసారు.  ఎంతో ప్రభావ వంతమైన జీవ కారుణ్య పరిరక్షణ సంస్థలు,  న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు  ఈ వుద్యమాన్ని పరిగణనలోకి  తీసుకొని తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.   తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలిగినా తాము కుల, మత, వర్గ, లింగ భేధలు లేకుండా అంతా ఒక్క తాటి పై నిలబడి ఎంత తీవ్రంగా స్పందిస్తారో కేంద్రానికి  తెలియచెప్పారు.  కేంద్రం మెడలు వంచి, వున్న చట్టాలను సవరించి, అనువైన ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టేలా చేసి,  జల్లికట్టు కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం ద్వారా పై చేయి సాధించారు తమిళ ప్రజలు.   ఒక సంప్రదాయ క్రీడ విషయమై రేగిన అలజడికి తక్షణమే స్పందించి,  పరిస్థితులు చేయి దాటిపోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకున్న కేంద్రం -  అసహాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యవసర ఆక్సిజన్ లాంటి "ప్రత్యేక హోదా"  పై ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తుంది..?  నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఇందులో కేంద్రం తప్పేమీ లేదు.  మన ప్రక్క రాష్ట్రం ఒక ఆట కోసం అంతగా తెగువ చూపించి సాధించుకుంటే,  రాష్ట్ర జీవనాధార హక్కు సాధించుకోవడానికి పార్టీలు గాని,   ప్రజానీకంగాని ఆ స్తాయిలో స్పందించలేదు అన్నది వాస్తవం.  ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే  అధికార, ప్రధాన పార్టీ  తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వుండి కూడా ప్రత్యేక హోదా పై గట్టిగా నిలదీయలేక పోయింది.   ఇన్నాళ్ళ అన్యోన్య దాంపత్యం అనంతరం ప్రజాగ్రహాన్ని గుర్తించి రాజకీయ విడాకులు తీసుకొని,   ఒప్పంద బంధాన్ని గౌరవించి ఈ పాపాలను భరించాను గాని,   తప్పంతా బిజెపి దే అని తన రాజకీయ విధానాన్ని సమర్ధించుకో చూస్తుంది.   ప్రత్యేక హోదా సాధ్యపడే విషయం కాదని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే  కేంద్రం తేల్చి చెప్పినా, ఇన్నాళ్ళు కలసి కొనసాగడం తమ తప్పిదమేనని చంద్రబాబు ఒప్పుకొని వుంటే ఎంతో హుందాగా వుండేది.   ఇక ప్రధాన ప్రతిపక్షం వై యస్ ఆర్ సి పి మొదటి నుండి ప్రత్యేక హోదా పై గళం విప్పుతున్నా..   అది "అశ్వత్థామ అతహ్ కుంజరహ"   రీతిలోనే కొనసాగిస్తు వస్తున్నారు.   గట్టిగా నినదిస్తే ఇప్పుడిప్పుడే స్నేహ హస్తాన్ని చాస్తున్న మోడీ చెయ్యిస్తారేమో అన్న సంశయం కారణం కావొచ్చు.  ప్రత్యేక హోదా ఇతర విభజన హామీలు అమలుకు భరోసా ఇచ్చింది  టిడిపి - బిజెపి ద్వయమే కాబట్టి,  అవి అమలులో విఫలమైతే ప్రజలలో చులకన అయ్యేది వారే కదా..!  అది మా పార్టీకి లాభమే కదా..!   అన్న విధానంలోనే జగన్ ఆలోచిస్తూ వస్తున్నారు.   అంతే తప్ప "ప్రత్యేక హోదా" వంటి వజ్రాయుధాన్ని నాలుగేళ్ళుగా నిరుపయోగంగా ఒరలో పెట్టుకు తిరుగుతున్నానన్న విషయాన్ని విస్మరించారు.   అవసరమైతే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్ ఎప్పుడో ప్రకటించారు.   ఆనాడే ఆ పని చేసి వుంటే ఈనాడు రాష్ట్రంలో జగన్ ఒక ప్రభంజనమై నిలిచే వారు. పదవీకాలం ముగుస్తున్న ఈ తరుణంలో రాజీనామాలు చేయించినా అంత ప్రాధాన్యం ఏముంటుంది..?   ఇక జనసేన ది కూడా ఇలాంటి తంతే.   పవన్ షూటింగ్ విరామ సమయాలలో అడపదడపా సభలు పెట్టి,  ప్రత్యేక హోదా పై ప్రజలు వుద్యమించాలని వుద్భోధించడమే గాని,   ప్రత్యక్ష కార్యచరణ కార్యక్రమాలు చేపట్ట లేదు.  ఒక ప్రక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ..  రెండిటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక పవన్ ఈ నాలుగేళ్ళు సతమత మయ్యారు.   ఇప్పటి నుండి పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయించడానికి నిశ్చయించుకున్నా,  రాష్ట్రం కోసం వుద్యమించే చాలా విలువైన కాలాన్ని  ఆయన   కోల్పోయారు. మేము అధికారం లోకి వస్తే "ప్రత్యేక హోదా" ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నెత్తి,  నోరు కొట్టుకున్నా  ఆంధ్ర ప్రజలు వారిని ఇప్పటికీ అనుమానాస్పదంగానే చూస్తున్నారు.   రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గత నాలుగేళ్ళుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నది   "ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి"   మాత్రమే కనిపిస్తున్నది.   సమైఖ్యాంధ్ర వుద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్,  మరికొంత మంది వివిధ రంగాలకు చెందిన పెద్దలు నిరంతర పోరాటం చేస్తున్నారు.   ప్రధాన రాజకీయ పార్టీలు, మీడియ  నుండి తగిన సహకారం, ప్రోత్సాహం లభించకపోవడంతో వారి శ్రమ తగిన గుర్తింపుకు నోచుకోబడలేదు.    ప్రత్యేక హోదా విషయమై  పార్టీలన్నీ తమ జెండాలను ప్రక్కన పెట్టి,   ఒకటే అజెండాతో  పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఎప్పటినుండో చెపుతున్నా  ఈ పార్టీల చెవికెక్కలేదు.   ఇప్పటికైనా పార్టీలు అన్నీ (బిజెపి తప్పించి)  ప్రత్యేక హోదాపై తీవ్ర స్థాయి వుద్యమానికి సిద్దమవుతుండడం శుభపరిణామం.   కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేలా వుద్యమించాల్సిన భాద్యత ఆంధ్ర ప్రజల భుజస్కంధాలపైనే వుంది. 
   

11, మార్చి 2018, ఆదివారం

"మాతృదేవోభవ"...హాలంతా శోక వెల్లువ

అది 1992-93 కాలం.  అత్తెసరు చదువుతో.. అద్భుత భవిష్యత్ కోసం.. ఆరాటపడుతూ...   ఆప్త మితృడు భయ్యా( మా ఇంటి అనధికార దత్తపుత్రుడు)తో జీవనపోరాటం ప్రారంభించిన కాలం.  ఇరవయ్యేళ్ళు మించని ప్రాయంలో ఒక వైపు చేతులు కాల్చుకుంటూ ... అప్పుడప్పుడు కడుపు కాల్చుకుంటూ..  ఎక్కువగా కాళ్ళీడ్చుకుంటూ  విశాఖ మహానగరాన్ని అపురూపంగా చూస్తూ గడిపేస్తున్న అందమైన, అమూల్యమైన రోజులు.  మేము ఏపాట్లు పడుతున్నామో (సహజ బ్యాచిలర్ కోతి చేష్టలు అలవడ్డాయేమో కనుక్కుందామన్న మిష కూడా కావచ్చు) అని కొత్తలో ఒకసారి నాన్న వచ్చారు.   ఇంటిగల వారు, ఇతర పక్క కుటుంబాల వారు మాపై మంచి అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో నాన్న సంతోషపడ్డారు.  ఆయనకు, మాకు కొద్దిగా సినిమా పిచ్చి వుండడంతో ఒక ఆధివారం జగదాంబ థియేటర్ కు తీసుకువెళ్ళాం.   దానిలో అప్పటి నలుగురు అగ్ర కథానాయకులలో ఒకరి చిత్రం నడుస్తున్న గుర్తు.  టిక్కెట్స్ అయిపోవడంతో  బ్లాక్ లో ఒక టికెట్ సంపాదించి ఆయనను పంపించాం. ఆయన వచ్చేవరకు వుండాల్సిందే కదా అని చుట్టుపక్కల థియేటర్స్ చూస్తే ఒక దానిలో (వెంకటేశ్వర థియేటర్ అని గుర్తు) "మాతృదేవోభవ"  ఆడుతుంది.   నాజర్, మాధవి హీరో, హీరోయిన్స్.  అంత ఆసక్తి లేకున్నా ఏదో కాలక్షేపం చేయాలన్న వుద్దేశ్యంతో టికెట్స్ తీసుకొని వెళ్ళికూర్చున్నాము.   సినిమా ప్రారంభమయ్యే సమయానికి థియేటర్ ఫుల్ అయిపోయింది.   75 శాతం మహిళా ప్రేక్షకులే వున్నారు.   సినిమా మొదలైన కొద్ది సేపటికే మహిళలు ఏడుస్తుండడం చూసి "భలే సినిమాకు వచ్చాములే" అని నవ్వుకున్నాము.  ఇంటెర్వల్ కు చూస్తే ఆడవాళ్ళకన్నా మా మితృలిరువురమే ఎక్కువగా ఏడ్చినట్టు గమనించాం . సినిమా అయిపోయిన తరువాత, నీళ్ళతో ముఖం కడుక్కొని బయటకు వచ్చినట్టు బాగా గుర్తు.  నాజర్, మాధవి, తనికెళ్ళ భరణి అద్భుతంగా నటించారు.  మరీ ముఖ్యంగా మాధవి, ఆమె పిల్లలుగా నటించిన బాల నటులు ఆ పాత్రలలో జీవించారు. " రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే", "వేణువై వచ్చాను భువనానికి" ఈ రెండు పాటలు ఎప్పుడు విన్నా గుండెల్లో ఏదో తెలియని బాధ వెలుపలకు వస్తుంది.  వూహ తెలిసిన తరువాత ఇంతగా ఏడ్పించిన చిత్రం మరొకటి లేదు.  ఈ సినిమా చాలా అవార్డ్స్ పొందడంతో పాటు, కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ ను సాధించింది.  ఈ చిత్రం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాటి సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటాము.   

8, మార్చి 2018, గురువారం

కాంగ్రెస్ తప్పిదాల బాటలోనే బి.జె.పి అడుగులు..?

     దశాబ్దాల చరిత్రగల కాంగ్రెస్ కు కూడా సాధ్యంకాని రీతిలో బిజెపి నేడు అత్యధిక రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టిస్తుంది. ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ప్రణాళికలు రచించి ఈశాన్య రాష్ట్రాలలో కూడా పాగా వేసి భారత రాజకీయాలలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది.  ఎటొచ్చి దక్షిణాదిలోనే బిజెపికి గండిపడుతుంది.  కర్నాటక తప్పించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సొంతంగా అధికారంలోకి కాదుకదా వునికి కాపాడుకోవడానికే శ్రమించాల్సిన గడ్డు పరిస్థితి.  నాటి సమైఖ్యాంధ్రప్రదేశ్ లోను, నేటి నూతన నూతన ఆంధ్రప్రదేశ్ లోను తెలుగుదేశం తో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా అధికారంలో భాగస్వామ్యం పొందింది.  ప్రత్యేక హోదా తో పాటుగా ఇతర విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమయ్యిందన్న కారణం సాకుగా చూపి టిడిపి తనంత తానుగా తెగతెంపులు చేసుకోవడంతో,  దక్షిణాదిలో బిజెపికి వున్న ఒక్క అధికార ఆధారం  కూడా నేడు దూరం అయిపోయింది.  నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక, ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోయింది. నాడు కొందరు కాంగ్రెస్ పెద్దల ప్రోద్భలంతో తన ఇష్టానుసారం ఆంధ్రప్రదేశ్ ను విడగొట్టిన సోనియా తదుపరి తెలంగాణలో అధికారానికి ఆమడ దూరంలో నిలబడిపోవడమేకాక,  ఇటు ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా తుడుచుపెట్టుకుపోవడంతో తలపట్టుకొని కూర్చున్నారు. నేడు భారత రాజకీయాలలో బాహుబలిలా కీర్తించబడుతున్న  మోడీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయమై కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే రిపీట్ చేస్తున్నట్లు అనిపిస్తున్నది ప్రస్తుత రాజకీయ వాతావరణం.  కాంగ్రెస్ పతనం ఖాయమని నిర్ధారణ చేసుకొని, అప్పటి వరకు పార్టీలో కీలక భాద్యతలు నెరవేర్చిన పెద్ద తలకాయలు కొన్ని బిజెపిలోకి చప్పున దూకి తమ రాజకీయ పలుకుబడికి ఢోకా లేకుండా చూసుకున్నారు.  ప్రజలలో వారిపట్ల వున్న వ్యతిరేకత కొంతవరకు తగ్గిన తరువాత,  నాడు కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రభావితం చేసినట్లే బిజెపి అధిష్టానాన్ని ప్రభావితం చేయడం మొదలెట్టారని విశ్లేషకులు అంటున్నారు. స్వతహాగ మొదటి నుండి తెలుగుదేశంతో బద్దశతృత్వం కలిగి వున్న వీరు నెమ్మదిగా మోడీ-బాబుల మద్య నిప్పు రాజేసి, నేటి మంటలలో చలికాచుకుంటున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.  కేంద్రం పెద్ద ఎత్తున సహాయం చేస్తే అది టిడిపి ఇమేజ్ పెరగడానికి దొహదపడుతుంది తప్ప బిజెపికి ఏ మాత్రం ప్రయోజనం వుండదని,  రాష్ట్రంలొ ఏ పార్టీ అధికారంలో వున్నా బిజెపి ప్రసన్నం కోసం ప్రాకులాడాల్సిందే అన్న పెద్దల మాట విని  మోడీ నెమ్మదిగా సహాయ నిరాకరణ చేసినట్లు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే జగన్ ముందునుంచి బిజెపి సానుకూలత ప్రదర్శితుండడంతో బిజెపికి మరింత దన్ను వచినట్లైంది. నాడు లక్ష్మీ పార్వతి వ్యవహారం ముదిరినంత వరకు వేచివుండి, ప్రజలలోను, పార్టీ వర్గంలోను అధికారం ఎన్ టి ఆర్ వద్దనుండి చంద్ర బాబు చేపడితేనే బావుంటుంది అన్న అభిప్రాయం వచ్చేలా చేసి తన రాజకీయ చతురతను ప్రదర్శించిన బాబు నేడు మళ్ళీ తన చాణక్యాన్ని ప్రదర్శించారు.  ప్రత్యేక హోదా ఇతర అంశాలు సఫలత సాధించలేకపోవడంలో టిడిపి-బిజెపిలకు సమాన భాద్యత వున్నప్పటికి నేడు ఆ పాపం మొత్తం బిజెపి కే అంటగట్టడంలో కృతకృత్యుడయ్యారని చెప్పక తప్పదు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పరిస్తితికిలాగ   బిజెపిని తీసుకు వచ్చి  ఏకాకిని చేస్తునారు.  ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా కనిపిస్తుండడం,  పాదయాత్ర విజయవంతంగా సాగుతూ మైలేజ్ పెంచుకుంటున్న జగన్ కోరి కోరి ఇప్పుడు బిజెపి పొత్తు కొరివి కొని తెచ్చుకొనే సాహసం చేయడు.  ఇప్పటికైనా బిజెపి అధిష్ఠానం కళ్ళు తెరచి ఎపికి సాయమందించకుంటే 2014 లో కాంగ్రెస్ కు జరిగిన పరాభవమే పునరావృతం అయ్యే అవకాశాలు కమలానికి పుష్కలంగా కనిపిస్తున్నాయి.  గతంలో ఎన్నడూ లేనంత బలీయంగా వున్న బిజెపి కి  తెలుగు రాష్ట్రాలలో ఎదురుగాలి పెద్ద విషయం కాకపోవచ్చు కాని, ఆ మహా సామ్రాజ్యపు కోటలకి బీటలు పడే బీజం ఇక్కడే కావొచ్చు.   

8, ఫిబ్రవరి 2018, గురువారం

రిపేర్ లు అంటూ వస్తారు...తస్మాత్ జాగ్రత్త!

చిన్న, చిన్న సమస్యలు మొదలుకొని పెద్ద, పెద్ద సమస్యల వరకు సాంకేతికత అభివృద్ధి పుణ్యమా అని కూర్చున్న చోటునుండి కదలకుండానే పరిష్కారం అయిపోతున్నాయి. ఈ క్రమంలో అంతే సులువుగా, వేగంగా సరికొత్త ఆపదలు కూడా ఆధునికత ముసుగులో తరుముకొస్తున్నాయి.మిక్సీ పాడవడంతో అంతర్జాలంలో లభ్యమైన సర్వీసింగ్ నంబర్ కు ఫోన్ చేసింది హైద్రాబాద్ కు చెందిన ఓ గృహిణి. ఆ మహిళ ఇంటికి వెళ్ళిన సర్వీసింగ్ వ్యక్తి, నాలుగు రోజులపాటు అదే పని మీద తిరిగాడు తప్ప , మిక్సీ బాగు చేయలేదు. ఈ వంకతో ఆ మహిళతో సాన్నిహిత్యం పెంచుకొని, అదను చూసి ఆమెకు మత్తుమందు ఇచ్చి (బాధితురాలి కధనం ప్రకారం) వివస్త్రను చేసి ఫోటోలు తీసాదు. వాటిని చూపి ,బయటపెడతానని బెదిరించి పలుమార్లు ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయినప్పటికి ఆమె ఫోటోలు బహిర్గతమై, కుటుంభంలో గొడవలకు దారితీయడంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.వెంటనే స్పందించిన పోలీసులు ఆ కిరాతకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపినా ఆ మహిళకు, కుటుంబ పరువుకు తీరని అవమానం జరిగిపోయింది. ఇది కేవలం హైద్రాబాద్ లో జరిగిన ఘటన మాత్రమే కాదు. కొంచెం అటు ఇటుగా చిన్న చిన్న పట్టణాలలోను జరుగుతున్న దుస్సంఘటనలకు ప్రత్యక్ష సాక్ష్యం. కాలం మారుతున్న కొద్ది ఉమ్మడి కుటుంబాలు పోయి చిన్న కుటుంబాలుగా మారిపొయిన ప్రస్తుత తరుణం లో అసాంఘిక మూకలు ఒంటరిగా మహిళలు, వృద్ధులు వున్న ఇళ్ళపై తమ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొరియర్ బాయ్స్ (మహిళలు కూడా ఈ ముఠాలలో వుటున్నారు), సేల్స్ పర్సన్స్ తరహా మార్గాలను ఎంచుకొని పట్టపగలే ఇళ్ళలోకి చొరబడి కొల్లగొడుతున్నారు. మహిళలు ఒంటరిగా వున్న సమయంలో అపరిచిత వ్యక్తులను ఇంటిలోనికి అనుమతించడం కోరి ప్రమాదాలను తెచ్చుకోవడమే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త..! 

5, జనవరి 2018, శుక్రవారం

ప్రారంభమైన కోహ్లి - రవిశాస్త్రి ల "హీట్ మూన్" డేస్

విరాట్ కోహ్లి- అనుష్కల వివాహం, హనీమూన్ లు జరిగి కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సంసారంలో గొడవలా అని ఆశ్చర్యపోకండి. ఇది పెళ్ళికి సంబంధించినది కాదు. ఇది భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి- కోచ్ రవిశాస్త్రిల ప్రొఫెషన్ల కు సంబంధించినది.  గత కొద్ది కాలంగా విజయాల మీద విజయాలు సాధిస్తున్న భారత క్రికెట్ జట్టుకు నేటి నుండి ప్రారంభం అవుతున్న దక్షిణాఫ్రికా పర్యటన అసలైన సవాల్ ను విసురుతున్నది. భారత్, స్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి భారత ఉప ఖండపు జట్లు స్వదేశంలో ఎంత బలమైనవో, విదేశాలలో ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో అంత బలహీనమైనవని గణాంకాలే తెలియజేస్తుంటాయి. ఇటీవల ఈ దేశాలపై భారత్ సిరీస్ విజయాలు సాధించింది. కాకపోతే అది స్వదేశంలోనే అన్నది మన అభిమానులకు గుర్తే. వెస్టిండీస్, శ్రీలంక వంటి దేశాలపై వారి దేశంలోనే గెలిచినా, వాటిని బలమైన ప్రత్యర్ధులుగా అభిమానులు భావించరు.  కోచ్ గా రవిశాస్త్రికి, కెప్టెన్ గా కోహ్లి కి ఇది అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్. నిబద్దత, అంకిత భావం మెండుగా కలిగిన ఆటగాడిగా పేరుగడించిన కుంబ్లే, కోచ్ గా కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు.  కొహ్లి తో పాటుగా మెజారిటి సబ్యులతో పొసగకపోవడం తో హుందాగా తన కోచ్ పదవినుండి కుంబ్లే తప్పుకున్నాదు (తప్పించారు). కుంబ్లే వెళ్ళిపొయిన తరువాత "అతను ఆటగాళ్ళపట్ల స్కూల్ హెడ్ మాస్టర్ లా ప్రవర్తించే వాడు"అని కొద్దిమంది ఆటగాళ్ళు కుంబ్లేని విమర్శిస్తు మీడియాకు ఎక్కారు. కుంబ్లే మాత్రం వారి గురించి ఏ ఒక్క రోజు కామెంట్ చేయలేదు. అది అతని విజ్ణతకు నిదర్శనం. అసలు సిసలైన కోచ్ -ఆటగాళ్ళపై అదుపుకలిగి వుండి, వారిని తన ఆలోచనలకు, విధానాలకు అనుగుణంగా వారిని మలచుకుంటాడు. కుంబ్లే ఈ విధానాన్నే అమలు చేయడానికి తన వంతు ప్రయత్నం చేసాడు. అది కెప్టెన్ తో సహ మెజారిటీ సభ్యులకు నచ్చలేదు.  తమకు ఇష్టమైన, ఒక నాటి " ప్లే బాయ్" ఇమేజ్వున్న రవిశాస్త్రి కోచ్ గా వుండడానికి ఓటు వేసారు.ఇప్పటి వరకు దాదాపు భారత వుపఖండపు విజయాలతో నల్లేరు మీద నడకలా సాగిన కోహ్లి- రవిశాస్త్రి ల ద్వయానికి ఇది విషమపరీక్షే. ఈ సిరీస్ లో విజయం సాధిస్తేనే ఈ ద్వయానికి అసలైన ఖ్యాతి దక్కేది. తమ విజయాలు ఇంటనే కాదు, బయట కూడా సాధ్యమేనని వీరు నిరూపించాలని భారత అభిమానులుగా ఆకాంక్షిద్దాం.  

11, డిసెంబర్ 2017, సోమవారం

బిజెపి గుండెల్లో గుజరాత్ గుబులు

ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి కి ప్రతిష్టాత్మకం అన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఇక్కడ బిజెపి కనుక పరాజయం పాలైతే మోడీ దక్షత ప్రశ్నార్ధకం అవుతుంది. 20 సంవత్సరాలుకుపైగా గుజరాత్ లో బిజెపి అప్రతిహతంగా పరిపాలన కొనసాగించగలుగుతుంది అంటే అది మోడీ చలవే. గుజరాతీగా స్వంత రాష్ట్రంలో గెలుపు సాధించలేకుంటే, రానున్న 2019 లోక్ సభ ఎన్నికలలో అది తీవ్ర ప్రభవం చూపించే అవకాశాలు మెండుగా వుంటాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పీఠాలను పెంచుకుంటూ వస్తున్న బిజెపి కి గుజరాత్ పీఠం  గట్టి పిండంగా మారింది. వ్యాపారస్తులు ఎక్కువగా వుండే గుజరాత్ లో పెద్ద నోట్ల రద్ధు,  జిఎస్టి లాంటి ఆర్ధికపర అంశాలు కొద్దిగా ప్రభావం చూపించే అవకాశాం వుండొచ్చంటున్నారు విశ్లేషకులు.  ప్రధాన పోటీదారు కాంగ్రెస్ కుల సమీకరణల మీద, సంఘ నాయకుల మీద ఆధారపడడం వారి నాయకత్వలేమికి అద్దంపడుతుంది. పైకి బిజెపి పట్ల సానుకూలంగా కనిపిస్తున్నా..టిడిపి, టి ఆర్ ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు మాత్రం గుజరాత్ లో బిజెపి ఓటమి ని కోరుకుంటాయనడంలో సందేహం లేదు. తిరుగులేని మెజారిటీతో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కేంద్రం దీనితోనైనా ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యన్ని గుర్తిస్తుందని ఆశపడుతున్నాయి. చాల వరకు సర్వేలు గెలుపు పోటా, పోటీగా వుంటుందంటుండగా - కొన్ని మాత్రం బిజెపి కే మొగ్గు చూపిస్తున్నాయి. ఒక వేళ గుజరాత్ పీఠం మళ్ళీ బిజెపి నే దక్కించుకుంటే మాత్రం 2019 ఎన్నికలలో కూడా మోడీకి తిరుగు వుండదన్నది తిరుగులేని వాస్తవం అవుతుంది.        

12, నవంబర్ 2017, ఆదివారం

"నాన్నా..! ఇప్పులే వచ్చేయ్" (కథ..? వ్యథ..?)

                 "నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తుంది.
                             దిగులుకమ్మేసిన  మనసుతో  భారంగా మెయిన్ రోడ్ వైపు అడుగులు వేస్తున్న ప్రకాష్  చెవులకు తన కొడుకు ఏడుపు నెమ్మదిగా దూరం అవుతూవుంది.   వెనక్కి వెళ్ళిపోదామన్న కోరికను మరొక్కసారి బలవంతంగా అణచిపెట్టి ముందుకే నడక సాగించాడు.                                                                                                                        కుటుంబానికి వీడ్కోలు చెబుతున్నప్పటి నుండి అడ్డుకట్ట వేసి వుంచిన,  కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని జల జలా పారింది.  ఆ చలిలో  కన్నీటితో తడిసిన షర్ట్,   గుండెకు వెచ్చగా తగులుతుంటే - గొంతు మాత్రం గుటక కూడా వేయలేనంతగా పొడిబారిపోయింది.                                                                                                                               అప్పుడే ఆరు నెలలు అయిపోయింది ప్రకాష్ కు హైద్రాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయి.  కూతురు టెంత్ క్లాస్ కావడం తో,   ఆమె చదువుకు ఇబ్బందని కుటుంబాన్ని ఇక్కడేవుంచి ప్రకాష్ అటు ఇటూ తిరుగుతున్నాడు.  ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో ఇంటికి వచ్చి చూసుకొని, కావాల్సిన సరుకులు ఇతర సదుపాయాలు సమకూర్చి వెళుతుంటాడు.  అతని ఉద్యోగం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే విభాగమే అయినా, ప్రకాష్ పరిస్థితి తెలిసిన అక్కడి ఆఫీస్  వారు కొంచెం వెసులుబాటు ఇస్తూ వుంటారు.                                                                                                          కుమార్తె అర్ధం చేసుకొన్నా, బాగా చిన్న వాడయిన   చింటూ మాత్రం  తండ్రి ఎడబాటుకు ఇంకా అలవాటు పడడం లేదు.  కొత్తలో చింటూ నిద్రపోయిన తరువాత ఊరికి బయలుదేరేవాడు.    తరువాత తరువాత ప్రకాష్ వచ్చినప్పుడు   చాలా రాత్రి అయినాగాని నిద్రపోయేవాడు కాదు,   ఎక్కడ వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడోనని.  అప్పటి నుండి చింటూని సరిపుచ్చి హైద్రాబాద్ బయలుదేరేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చేస్తోంది.                                                                       " ఈ ఒక్క లోజు వుండు నాన్న"   అని వెళ్ళే ముందర బుంగమూతి పెట్టి అర్ధిస్తుంటే ఎలా బుజ్జగించాలో తెలియక సతమతమౌతుంటాడు.  ఇక నాన్న వెళ్ళక తప్పదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రం   "తొందలగా వచ్చేయే"   అని  పదే  పదే  చెబుతూ వీడ్కోలు చెపుతాడు.   ప్రకాష్ బస్ ఎక్కగానే ఫోన్ చేయాలి,  దాని కోసమే నిద్రపోకుండా ఎదురుచూస్తుంటాడు చింటూ.   " ఏ సీ బస్సా..? మామూలు బస్సా..?, టీవీ పెట్టాలా..?" అని కుశల ప్రశ్నలు వేసిన తరువాత    "తొందలగా వచ్చేయే.." అని పాత పాటే ఎత్తుకుంటాడు.
                                                                        మరి ఈ రోజెందుకో చాలా పేచీ పెట్టాడు.  మెడ కావళ్ళించుకొని వదల్లేదు,  బలవంతంగా విడిపించుకొంటే కాళ్ళకు అడ్డంపడి  కదలనివ్వలేదు.   పోనీ ఈ రోజుకు ఆగిపోదామా అంటే,   అప్పటికే ఒక రోజు అధికంగా వున్నాడు.   ఆఫీస్ లో కూడా పని ఎక్కువగా వుంది.  వెళ్ళక తప్పదు.   భార్య, కూతురు ఎంతో ప్రయాసపడితేగాని  చింటూని  ఇంట్లోకి తీసుకెళ్ళలేక పోయారు.                                                                                                                   బస్ ఎక్కగానే ఫోన్ చేసాడు.     దానికోసమే ఎదురుచూస్తున్న చింటూ " నాన్నా.. ఇప్పులే వచ్చేయ్..ఇప్పులే వచ్చేయ్ నాన్నా.."  అంటూ ఒకటే ఏడుస్తున్నాడు.    పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో ఆపుకుంటూ, మౌనంగా రోధించాడు తప్ప బదులు పలకలేకపోయాడు.   "నాన్న..! తమ్ముడు  ఫోన్ ఇచ్చేసి దిండులో తలపెట్టులొని ఏడుస్తున్నాడు"  అని కుమార్తె   జాలిగా చెప్పింది.   ఇంతలో ఫోన్ అందుకున్న భార్య  " కాసేపు ఆగితే అలాగే నిద్రపోతాడు,  ఉదయానికి మాములుగానే వుంటాడ "ని   భరోసా ఇచ్చేప్పటికి కొద్దిగా   తేలికపడ్డాడు   ప్రకాష్.
                                                                       ప్రకాష్ అలా కళ్ళు మూసుకున్న కొద్దిసేపట్లోనే  బస్   మరో స్టేజ్ లో ఆగింది.   ముగ్గురో నలుగురో  ప్రయాణీకులు ఎక్కారు.  వారిలో ఒకతను ప్రకాష్ వెనుక విండో సీటులో కూర్చున్నాడు.  ఎక్కిన కొద్దిసేపటికే   అతను ఫోన్  మాట్లాడడం  ప్రారంభించాడు.  అప్రయత్నంగా ఫోన్ స్పీకర్ ఆన్ కావడంతో  " డాడీ! నన్ను,మమ్మీని  కూడా నీతో తీసుకెళ్ళు..మేము వచ్చేస్తాం"  అని చిన్న పాప స్పష్టంగా అంటూ  ఏడుస్తుండడం   వినిపించింది.    ఆ వ్యక్తి పాపను బుజ్జగిస్తున్నాడు.   దానితో  ప్రకాష్ కు   చింటూ మాటలు మళ్ళీ తలపుకు వచ్చాయి.
                                                                              నిద్రపోతున్నాడో,  ఇంకా ఏడుస్తున్నాడో..?   ఫోన్ చేస్తే పోలా?   వద్దులే.. ఒక వేళ నిద్రపోతే మళ్ళీ  లేచి  పేచీపెడతాడు అని,   ఆ  ఆలోచన  విరమించుకున్నాడు.   వెనుక వ్యక్తి ఫోన్ సంభాషణలో పాస్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ అని పదే పదే పలుకుతుండడంతో ఏదో విదేశీ ప్రయాణానికి వెళుతున్నట్లున్నాడు  అనుకుంటూ   నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు    ప్రకాష్.

            *                *             *            *            *          *             *          *            *           *

                       ఒక్క కుదుపుతో  బస్ ఆగడంతో తుళ్ళిపడి లేచాడు   ప్రకాష్.     "గువ్వ.. గోరింకతో... "     చిరంజీవి సినిమాలోని పాట స్పీకర్ బాక్స్ లలో నుండి పెద్ద సౌండ్ తో వినిపిస్తుండడంతో ప్రయాణీకుల నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.     సమయం చూస్తే 1.30 ని. అయింది .   టీ  తాగడానికి బస్ ను హైవే ప్రక్క దాబా హోటల్ ముందు ఆపాడు డ్రైవర్.   ప్రకాష్ కు బస్ దిగబుద్ది కాకున్నా,  చలిగా వుండడంతో టీ తాగుదామని దిగాడు.   టీ కప్ తీసుకొని కొంచెం ఇవతలికి రాగా,   అక్కడ ఒంటరిగా నిలబడి సిగరెట్  కాలుస్తూ కనబడ్డాడు  తన వెనుక సీట్ లోని వ్యక్తి.  అతని కళ్ళు బాగా వుబ్బి, ఎర్రగా వున్నాయి.   నిద్రపట్టలేదనుకుంటా..బాగా ఏడ్చినట్టుగా  కూడా కనిపిస్తున్నాడు.                                                                      ఎప్పుడూ రిసర్వుడ్ గా వుండే ప్రకాష్ కొంత చొరవగా " ఏదైనా విదేశీ ప్రయాణానికి వెళుతున్నారా..?"  అని అతనితో మాట కలిపాడు.   "అవునండీ..! కువైట్ వెళుతున్నాను. అక్కడ ఒక కంపెనీలో తెలిసిన బంధువుల ద్వారా వుద్యోగం దొరికింది" అని  బదులిచ్చాడు అతను.     "రాత్రి మీరు  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు  మీ పాప అనుకుంటా బాగా ఏడుస్తుంది.   బయటకే వినిపించింది. మా బాబు కూడా రాత్రి అలాగే గోల పెట్టాడు " అని అతనిని  అడగడానికి గల కారణం చెప్పాడు.   అలాగే  తనగురించి  కూడా  అతనికి  చెప్పుకొచ్చాడు ప్రకాష్.                                                                                                                                                                                                                 ఆ వ్యక్తిది   గన్నవరం  అని,   హైవే విస్తరణలో వున్న ఒక్కగానొక్క కిరాణా షాప్ పోగా,  ఆ వచ్చిన డబ్బులు అప్పులకు,  కుటుంబ ఖర్చులకు కరిగిపోయినట్లు,  ఎటూ పాలుపోని పరిస్థితులలో తెలిసిన వారి ద్వారా ఈ విదేశీ ఉపాది పొందినట్లు అతని మాటల వల్ల తెలిసింది.
                                                    " మా పెళ్ళైన చాలా కాలానికి పుట్టింది పాప.   నా చిట్టి తల్లికి ఊహ తెలిసిన నాటి నుండి ఏ ఒక్క రోజు నేను విడిచి వుండలేదు.  ఈ మధ్య పాస్ పోర్ట్,    వీసా పనుల మీద తిరుగుతూ వుండడం వలన ఇంటికి  చేరెటప్పటికి  లేటవుతుండేది.  రాత్రి ఏ సమయమైనా నేను వచ్చే దాకా నిద్రపోకుండా ఎదురుచూసేది.   అలాంటి నా బంగారు తల్లిని మూడు సంవత్సరాలు చూడకుండా ఎలా వుండగలను..?   నా చిట్టి తల్లి ఎలా వుంటుంది..?"   అని వల వలా విలపించాడు.
                                                                           "చూడండి. నాకు ట్రాన్స్ ఫర్ వచ్చి నిన్నో, మొన్నో అయినట్లుంది.   అప్పుడే సంవత్సరం అయిపో వస్తుంది.  రోజులు ఎంతో వేగంగా గడచి పోతాయి.  మీకు  కూడా మూడు సంవత్సరాలు ఇట్టే కరిగిపోతాయి.   మీరైనా, నేనైనా కుటుంబానికి  దూరంగా గడపాల్సి వస్తుందంటే   కారణం మన వాళ్ళ మంచి భవిష్యత్ కోసమే కదా..?   మీరు తెచ్చే ఆర్ధిక భద్రతతో  ఇకపై  జీవితాంతం కుటుంబానికి దగ్గరగా వుంటూనే ఏదో ఒక ఆసరా చూసుకోవచ్చు"    అని ఓదార్చాడు ప్రకాష్.                                                                                                                                               సాధారణంగా మనిషి తనకున్న సమస్యలే భరించలేనివని తలచుకొని మరి మరి బాధపడుతుంటాడు.  ఎప్పుడైతే తనకంటే సమస్యలు, కష్టాలు ఎక్కువగా వున్నవారిని ప్రత్యక్షంగా చూస్తాడో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్  తెచ్చుకుంటాడు.   ఇప్పుడు ప్రకాష్ పరిస్థితి అలానే వుంది.   అతనితో పోల్చుకుంటే తన పరిస్థితి ఎన్నో రెట్లు బెటర్.   ప్రకాష్ లో నూతనోత్సాహం తొణికిసలాడింది.  బస్ బయలుదేరడంతో అందరూ తమ సీట్లలో సర్దుకున్నారు.   చలి బాగా పెరిగింది.  బస్ స్పీడ్ అందుకుంది.                                                                   
    *       *       *       *       *        *      *       *      *       *      *        *           *         *          *          *

                                  సమయం తెల్లవారి 4 గంటలు కావొస్తుంది.   తెల్లవారుజామునే నిద్ర లేచె అలవాటున్న - ముందు సేటులోని  పెద్దాయన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్ లోని పాత పాటలు వింటున్నాడు.                                                                మరో గంటన్నరలో బస్ తన గమ్యస్థానం చేరేదే...అన్నీ సవ్యంగా జరిగితే...                                              ఆ బస్ కన్నీరును తుడుస్తున్నాయా అన్నట్లుగా అద్దాలపై కురుస్తున్న మంచుధారలను స్వై పర్స్ క్లీన్ చేస్తున్నాయి.   నిద్ర మగతతో మూతలు పడబోతున్న రెప్పలను బలవంతంగా ఆపుచేసుకుంటున్న డ్రైవర్, ఎదురుగా ఆగివున్న లారీని గమనించలేదు.    గమనించేలోపే ఘోరం జరిగిపోయింది.                                                                       ఇయర్ ఫోన్స్ ఎక్కడికో ఎగిరిపోవడంతో ఫోన్లోని పాట బయటకు వినిపిస్తుంది.                                                            "ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక..."    

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...