5, జనవరి 2018, శుక్రవారం

ప్రారంభమైన కోహ్లి - రవిశాస్త్రి ల "హీట్ మూన్" డేస్

విరాట్ కోహ్లి- అనుష్కల వివాహం, హనీమూన్ లు జరిగి కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సంసారంలో గొడవలా అని ఆశ్చర్యపోకండి. ఇది పెళ్ళికి సంబంధించినది కాదు. ఇది భారత క్రికెట్ కెప్టెన్ కోహ్లి- కోచ్ రవిశాస్త్రిల ప్రొఫెషన్ల కు సంబంధించినది.  గత కొద్ది కాలంగా విజయాల మీద విజయాలు సాధిస్తున్న భారత క్రికెట్ జట్టుకు నేటి నుండి ప్రారంభం అవుతున్న దక్షిణాఫ్రికా పర్యటన అసలైన సవాల్ ను విసురుతున్నది. భారత్, స్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి భారత ఉప ఖండపు జట్లు స్వదేశంలో ఎంత బలమైనవో, విదేశాలలో ముఖ్యంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో అంత బలహీనమైనవని గణాంకాలే తెలియజేస్తుంటాయి. ఇటీవల ఈ దేశాలపై భారత్ సిరీస్ విజయాలు సాధించింది. కాకపోతే అది స్వదేశంలోనే అన్నది మన అభిమానులకు గుర్తే. వెస్టిండీస్, శ్రీలంక వంటి దేశాలపై వారి దేశంలోనే గెలిచినా, వాటిని బలమైన ప్రత్యర్ధులుగా అభిమానులు భావించరు.  కోచ్ గా రవిశాస్త్రికి, కెప్టెన్ గా కోహ్లి కి ఇది అత్యంత ప్రతిష్టాత్మక సిరీస్. నిబద్దత, అంకిత భావం మెండుగా కలిగిన ఆటగాడిగా పేరుగడించిన కుంబ్లే, కోచ్ గా కూడా అంతే పేరు తెచ్చుకున్నాడు.  కొహ్లి తో పాటుగా మెజారిటి సబ్యులతో పొసగకపోవడం తో హుందాగా తన కోచ్ పదవినుండి కుంబ్లే తప్పుకున్నాదు (తప్పించారు). కుంబ్లే వెళ్ళిపొయిన తరువాత "అతను ఆటగాళ్ళపట్ల స్కూల్ హెడ్ మాస్టర్ లా ప్రవర్తించే వాడు"అని కొద్దిమంది ఆటగాళ్ళు కుంబ్లేని విమర్శిస్తు మీడియాకు ఎక్కారు. కుంబ్లే మాత్రం వారి గురించి ఏ ఒక్క రోజు కామెంట్ చేయలేదు. అది అతని విజ్ణతకు నిదర్శనం. అసలు సిసలైన కోచ్ -ఆటగాళ్ళపై అదుపుకలిగి వుండి, వారిని తన ఆలోచనలకు, విధానాలకు అనుగుణంగా వారిని మలచుకుంటాడు. కుంబ్లే ఈ విధానాన్నే అమలు చేయడానికి తన వంతు ప్రయత్నం చేసాడు. అది కెప్టెన్ తో సహ మెజారిటీ సభ్యులకు నచ్చలేదు.  తమకు ఇష్టమైన, ఒక నాటి " ప్లే బాయ్" ఇమేజ్వున్న రవిశాస్త్రి కోచ్ గా వుండడానికి ఓటు వేసారు.ఇప్పటి వరకు దాదాపు భారత వుపఖండపు విజయాలతో నల్లేరు మీద నడకలా సాగిన కోహ్లి- రవిశాస్త్రి ల ద్వయానికి ఇది విషమపరీక్షే. ఈ సిరీస్ లో విజయం సాధిస్తేనే ఈ ద్వయానికి అసలైన ఖ్యాతి దక్కేది. తమ విజయాలు ఇంటనే కాదు, బయట కూడా సాధ్యమేనని వీరు నిరూపించాలని భారత అభిమానులుగా ఆకాంక్షిద్దాం.  

11, డిసెంబర్ 2017, సోమవారం

బిజెపి గుండెల్లో గుజరాత్ గుబులు

ప్రస్తుతం జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు బిజెపి కి ప్రతిష్టాత్మకం అన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఇక్కడ బిజెపి కనుక పరాజయం పాలైతే మోడీ దక్షత ప్రశ్నార్ధకం అవుతుంది. 20 సంవత్సరాలుకుపైగా గుజరాత్ లో బిజెపి అప్రతిహతంగా పరిపాలన కొనసాగించగలుగుతుంది అంటే అది మోడీ చలవే. గుజరాతీగా స్వంత రాష్ట్రంలో గెలుపు సాధించలేకుంటే, రానున్న 2019 లోక్ సభ ఎన్నికలలో అది తీవ్ర ప్రభవం చూపించే అవకాశాలు మెండుగా వుంటాయి. రాష్ట్రాల ముఖ్యమంత్రుల పీఠాలను పెంచుకుంటూ వస్తున్న బిజెపి కి గుజరాత్ పీఠం  గట్టి పిండంగా మారింది. వ్యాపారస్తులు ఎక్కువగా వుండే గుజరాత్ లో పెద్ద నోట్ల రద్ధు,  జిఎస్టి లాంటి ఆర్ధికపర అంశాలు కొద్దిగా ప్రభావం చూపించే అవకాశాం వుండొచ్చంటున్నారు విశ్లేషకులు.  ప్రధాన పోటీదారు కాంగ్రెస్ కుల సమీకరణల మీద, సంఘ నాయకుల మీద ఆధారపడడం వారి నాయకత్వలేమికి అద్దంపడుతుంది. పైకి బిజెపి పట్ల సానుకూలంగా కనిపిస్తున్నా..టిడిపి, టి ఆర్ ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు మాత్రం గుజరాత్ లో బిజెపి ఓటమి ని కోరుకుంటాయనడంలో సందేహం లేదు. తిరుగులేని మెజారిటీతో ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కేంద్రం దీనితోనైనా ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యన్ని గుర్తిస్తుందని ఆశపడుతున్నాయి. చాల వరకు సర్వేలు గెలుపు పోటా, పోటీగా వుంటుందంటుండగా - కొన్ని మాత్రం బిజెపి కే మొగ్గు చూపిస్తున్నాయి. ఒక వేళ గుజరాత్ పీఠం మళ్ళీ బిజెపి నే దక్కించుకుంటే మాత్రం 2019 ఎన్నికలలో కూడా మోడీకి తిరుగు వుండదన్నది తిరుగులేని వాస్తవం అవుతుంది.        

12, నవంబర్ 2017, ఆదివారం

"నాన్నా..! ఇప్పులే వచ్చేయ్" (కథ..? వ్యథ..?)

                 "నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తుంది.
                             దిగులుకమ్మేసిన  మనసుతో  భారంగా మెయిన్ రోడ్ వైపు అడుగులు వేస్తున్న ప్రకాష్  చెవులకు తన కొడుకు ఏడుపు నెమ్మదిగా దూరం అవుతూవుంది.   వెనక్కి వెళ్ళిపోదామన్న కోరికను మరొక్కసారి బలవంతంగా అణచిపెట్టి ముందుకే నడక సాగించాడు.                                                                                                                        కుటుంబానికి వీడ్కోలు చెబుతున్నప్పటి నుండి అడ్డుకట్ట వేసి వుంచిన,  కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని జల జలా పారింది.  ఆ చలిలో  కన్నీటితో తడిసిన షర్ట్,   గుండెకు వెచ్చగా తగులుతుంటే - గొంతు మాత్రం గుటక కూడా వేయలేనంతగా పొడిబారిపోయింది.                                                                                                                               అప్పుడే ఆరు నెలలు అయిపోయింది ప్రకాష్ కు హైద్రాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయి.  కూతురు టెంత్ క్లాస్ కావడం తో,   ఆమె చదువుకు ఇబ్బందని కుటుంబాన్ని ఇక్కడేవుంచి ప్రకాష్ అటు ఇటూ తిరుగుతున్నాడు.  ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో ఇంటికి వచ్చి చూసుకొని, కావాల్సిన సరుకులు ఇతర సదుపాయాలు సమకూర్చి వెళుతుంటాడు.  అతని ఉద్యోగం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే విభాగమే అయినా, ప్రకాష్ పరిస్థితి తెలిసిన అక్కడి ఆఫీస్  వారు కొంచెం వెసులుబాటు ఇస్తూ వుంటారు.                                                                                                          కుమార్తె అర్ధం చేసుకొన్నా, బాగా చిన్న వాడయిన   చింటూ మాత్రం  తండ్రి ఎడబాటుకు ఇంకా అలవాటు పడడం లేదు.  కొత్తలో చింటూ నిద్రపోయిన తరువాత ఊరికి బయలుదేరేవాడు.    తరువాత తరువాత ప్రకాష్ వచ్చినప్పుడు   చాలా రాత్రి అయినాగాని నిద్రపోయేవాడు కాదు,   ఎక్కడ వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడోనని.  అప్పటి నుండి చింటూని సరిపుచ్చి హైద్రాబాద్ బయలుదేరేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చేస్తోంది.                                                                       " ఈ ఒక్క లోజు వుండు నాన్న"   అని వెళ్ళే ముందర బుంగమూతి పెట్టి అర్ధిస్తుంటే ఎలా బుజ్జగించాలో తెలియక సతమతమౌతుంటాడు.  ఇక నాన్న వెళ్ళక తప్పదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రం   "తొందలగా వచ్చేయే"   అని  పదే  పదే  చెబుతూ వీడ్కోలు చెపుతాడు.   ప్రకాష్ బస్ ఎక్కగానే ఫోన్ చేయాలి,  దాని కోసమే నిద్రపోకుండా ఎదురుచూస్తుంటాడు చింటూ.   " ఏ సీ బస్సా..? మామూలు బస్సా..?, టీవీ పెట్టాలా..?" అని కుశల ప్రశ్నలు వేసిన తరువాత    "తొందలగా వచ్చేయే.." అని పాత పాటే ఎత్తుకుంటాడు.
                                                                        మరి ఈ రోజెందుకో చాలా పేచీ పెట్టాడు.  మెడ కావళ్ళించుకొని వదల్లేదు,  బలవంతంగా విడిపించుకొంటే కాళ్ళకు అడ్డంపడి  కదలనివ్వలేదు.   పోనీ ఈ రోజుకు ఆగిపోదామా అంటే,   అప్పటికే ఒక రోజు అధికంగా వున్నాడు.   ఆఫీస్ లో కూడా పని ఎక్కువగా వుంది.  వెళ్ళక తప్పదు.   భార్య, కూతురు ఎంతో ప్రయాసపడితేగాని  చింటూని  ఇంట్లోకి తీసుకెళ్ళలేక పోయారు.                                                                                                                   బస్ ఎక్కగానే ఫోన్ చేసాడు.     దానికోసమే ఎదురుచూస్తున్న చింటూ " నాన్నా.. ఇప్పులే వచ్చేయ్..ఇప్పులే వచ్చేయ్ నాన్నా.."  అంటూ ఒకటే ఏడుస్తున్నాడు.    పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో ఆపుకుంటూ, మౌనంగా రోధించాడు తప్ప బదులు పలకలేకపోయాడు.   "నాన్న..! తమ్ముడు  ఫోన్ ఇచ్చేసి దిండులో తలపెట్టులొని ఏడుస్తున్నాడు"  అని కుమార్తె   జాలిగా చెప్పింది.   ఇంతలో ఫోన్ అందుకున్న భార్య  " కాసేపు ఆగితే అలాగే నిద్రపోతాడు,  ఉదయానికి మాములుగానే వుంటాడ "ని   భరోసా ఇచ్చేప్పటికి కొద్దిగా   తేలికపడ్డాడు   ప్రకాష్.
                                                                       ప్రకాష్ అలా కళ్ళు మూసుకున్న కొద్దిసేపట్లోనే  బస్   మరో స్టేజ్ లో ఆగింది.   ముగ్గురో నలుగురో  ప్రయాణీకులు ఎక్కారు.  వారిలో ఒకతను ప్రకాష్ వెనుక విండో సీటులో కూర్చున్నాడు.  ఎక్కిన కొద్దిసేపటికే   అతను ఫోన్  మాట్లాడడం  ప్రారంభించాడు.  అప్రయత్నంగా ఫోన్ స్పీకర్ ఆన్ కావడంతో  " డాడీ! నన్ను,మమ్మీని  కూడా నీతో తీసుకెళ్ళు..మేము వచ్చేస్తాం"  అని చిన్న పాప స్పష్టంగా అంటూ  ఏడుస్తుండడం   వినిపించింది.    ఆ వ్యక్తి పాపను బుజ్జగిస్తున్నాడు.   దానితో  ప్రకాష్ కు   చింటూ మాటలు మళ్ళీ తలపుకు వచ్చాయి.
                                                                              నిద్రపోతున్నాడో,  ఇంకా ఏడుస్తున్నాడో..?   ఫోన్ చేస్తే పోలా?   వద్దులే.. ఒక వేళ నిద్రపోతే మళ్ళీ  లేచి  పేచీపెడతాడు అని,   ఆ  ఆలోచన  విరమించుకున్నాడు.   వెనుక వ్యక్తి ఫోన్ సంభాషణలో పాస్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ అని పదే పదే పలుకుతుండడంతో ఏదో విదేశీ ప్రయాణానికి వెళుతున్నట్లున్నాడు  అనుకుంటూ   నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు    ప్రకాష్.

            *                *             *            *            *          *             *          *            *           *

                       ఒక్క కుదుపుతో  బస్ ఆగడంతో తుళ్ళిపడి లేచాడు   ప్రకాష్.     "గువ్వ.. గోరింకతో... "     చిరంజీవి సినిమాలోని పాట స్పీకర్ బాక్స్ లలో నుండి పెద్ద సౌండ్ తో వినిపిస్తుండడంతో ప్రయాణీకుల నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.     సమయం చూస్తే 1.30 ని. అయింది .   టీ  తాగడానికి బస్ ను హైవే ప్రక్క దాబా హోటల్ ముందు ఆపాడు డ్రైవర్.   ప్రకాష్ కు బస్ దిగబుద్ది కాకున్నా,  చలిగా వుండడంతో టీ తాగుదామని దిగాడు.   టీ కప్ తీసుకొని కొంచెం ఇవతలికి రాగా,   అక్కడ ఒంటరిగా నిలబడి సిగరెట్  కాలుస్తూ కనబడ్డాడు  తన వెనుక సీట్ లోని వ్యక్తి.  అతని కళ్ళు బాగా వుబ్బి, ఎర్రగా వున్నాయి.   నిద్రపట్టలేదనుకుంటా..బాగా ఏడ్చినట్టుగా  కూడా కనిపిస్తున్నాడు.                                                                      ఎప్పుడూ రిసర్వుడ్ గా వుండే ప్రకాష్ కొంత చొరవగా " ఏదైనా విదేశీ ప్రయాణానికి వెళుతున్నారా..?"  అని అతనితో మాట కలిపాడు.   "అవునండీ..! కువైట్ వెళుతున్నాను. అక్కడ ఒక కంపెనీలో తెలిసిన బంధువుల ద్వారా వుద్యోగం దొరికింది" అని  బదులిచ్చాడు అతను.     "రాత్రి మీరు  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు  మీ పాప అనుకుంటా బాగా ఏడుస్తుంది.   బయటకే వినిపించింది. మా బాబు కూడా రాత్రి అలాగే గోల పెట్టాడు " అని అతనిని  అడగడానికి గల కారణం చెప్పాడు.   అలాగే  తనగురించి  కూడా  అతనికి  చెప్పుకొచ్చాడు ప్రకాష్.                                                                                                                                                                                                                 ఆ వ్యక్తిది   గన్నవరం  అని,   హైవే విస్తరణలో వున్న ఒక్కగానొక్క కిరాణా షాప్ పోగా,  ఆ వచ్చిన డబ్బులు అప్పులకు,  కుటుంబ ఖర్చులకు కరిగిపోయినట్లు,  ఎటూ పాలుపోని పరిస్థితులలో తెలిసిన వారి ద్వారా ఈ విదేశీ ఉపాది పొందినట్లు అతని మాటల వల్ల తెలిసింది.
                                                    " మా పెళ్ళైన చాలా కాలానికి పుట్టింది పాప.   నా చిట్టి తల్లికి ఊహ తెలిసిన నాటి నుండి ఏ ఒక్క రోజు నేను విడిచి వుండలేదు.  ఈ మధ్య పాస్ పోర్ట్,    వీసా పనుల మీద తిరుగుతూ వుండడం వలన ఇంటికి  చేరెటప్పటికి  లేటవుతుండేది.  రాత్రి ఏ సమయమైనా నేను వచ్చే దాకా నిద్రపోకుండా ఎదురుచూసేది.   అలాంటి నా బంగారు తల్లిని మూడు సంవత్సరాలు చూడకుండా ఎలా వుండగలను..?   నా చిట్టి తల్లి ఎలా వుంటుంది..?"   అని వల వలా విలపించాడు.
                                                                           "చూడండి. నాకు ట్రాన్స్ ఫర్ వచ్చి నిన్నో, మొన్నో అయినట్లుంది.   అప్పుడే సంవత్సరం అయిపో వస్తుంది.  రోజులు ఎంతో వేగంగా గడచి పోతాయి.  మీకు  కూడా మూడు సంవత్సరాలు ఇట్టే కరిగిపోతాయి.   మీరైనా, నేనైనా కుటుంబానికి  దూరంగా గడపాల్సి వస్తుందంటే   కారణం మన వాళ్ళ మంచి భవిష్యత్ కోసమే కదా..?   మీరు తెచ్చే ఆర్ధిక భద్రతతో  ఇకపై  జీవితాంతం కుటుంబానికి దగ్గరగా వుంటూనే ఏదో ఒక ఆసరా చూసుకోవచ్చు"    అని ఓదార్చాడు ప్రకాష్.                                                                                                                                               సాధారణంగా మనిషి తనకున్న సమస్యలే భరించలేనివని తలచుకొని మరి మరి బాధపడుతుంటాడు.  ఎప్పుడైతే తనకంటే సమస్యలు, కష్టాలు ఎక్కువగా వున్నవారిని ప్రత్యక్షంగా చూస్తాడో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్  తెచ్చుకుంటాడు.   ఇప్పుడు ప్రకాష్ పరిస్థితి అలానే వుంది.   అతనితో పోల్చుకుంటే తన పరిస్థితి ఎన్నో రెట్లు బెటర్.   ప్రకాష్ లో నూతనోత్సాహం తొణికిసలాడింది.  బస్ బయలుదేరడంతో అందరూ తమ సీట్లలో సర్దుకున్నారు.   చలి బాగా పెరిగింది.  బస్ స్పీడ్ అందుకుంది.                                                                   
    *       *       *       *       *        *      *       *      *       *      *        *           *         *          *          *

                                  సమయం తెల్లవారి 4 గంటలు కావొస్తుంది.   తెల్లవారుజామునే నిద్ర లేచె అలవాటున్న - ముందు సేటులోని  పెద్దాయన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్ లోని పాత పాటలు వింటున్నాడు.                                                                మరో గంటన్నరలో బస్ తన గమ్యస్థానం చేరేదే...అన్నీ సవ్యంగా జరిగితే...                                              ఆ బస్ కన్నీరును తుడుస్తున్నాయా అన్నట్లుగా అద్దాలపై కురుస్తున్న మంచుధారలను స్వై పర్స్ క్లీన్ చేస్తున్నాయి.   నిద్ర మగతతో మూతలు పడబోతున్న రెప్పలను బలవంతంగా ఆపుచేసుకుంటున్న డ్రైవర్, ఎదురుగా ఆగివున్న లారీని గమనించలేదు.    గమనించేలోపే ఘోరం జరిగిపోయింది.                                                                       ఇయర్ ఫోన్స్ ఎక్కడికో ఎగిరిపోవడంతో ఫోన్లోని పాట బయటకు వినిపిస్తుంది.                                                            "ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక..."    

3, నవంబర్ 2017, శుక్రవారం

సినీ పాటల రచయిత "భువనచంద్ర"లో మరో కోణం

సినిమా పాటల రచయితగా చాలా ప్రసిద్దులు భువనచంద్ర. యువతను హుషారెక్కించే పాటలే కాదు, సెగ రేకెత్తించే శృంగార గీతాలుతో ఉర్రూతలూగించారు. ఆయన ఆహార్యం చూసి ఆ పాటల రచనకు తగ్గట్టే అభినవ శృంగార శ్రీనాధ కవి సార్వబౌముడు అనుకొనే అవకాశం వందశాతం వుంది. నిజానికి ఆయన తన 20 వ యేటనే ఆద్యాత్మిక ధ్యాసతో హిమాలయాలలో సంచరించారన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ఎందరో గురువులను సందర్శించి వారి ఆదరణ,అభిమానాన్ని చూరగొన్నారు. సంవత్సరాల తరబడి దైవద్యానంలో సమపార్జించుకొనే జ్ణానాన్ని, దైనందిన జీవితం గడుపుతూనే భువన చంద్ర సాధించారు. "బాటసారి" అన్న పేరు మీద తన ఆధ్యాత్మిక ప్రయాణ అనుభవాలను "వాళ్ళు" అన్న పుస్తకం ద్వారా పాటకులతో పంచుకున్నారు. ఎవరీ బాటసారి అని పాటక లోకంలో వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా ఆ ఆద్యాత్మిక బాటసారి తానేనని బయటపడి చెప్పాల్సిన ఆవశ్యకత వచ్చింది. హిమాలయ పర్వత సానువులలోను, ఉద్యోగ విధులలోను అనుభవించిన అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతుల సమాహారం ఈ "వాళ్ళు" పుస్తకం. ఒకరి వృత్తిని బట్టి వారి ప్రవృత్తిని అంచనావేయడం సరికాదనే సంగతి మరోసారి రుజువయ్యింది. ఈ పుస్తక పటనం ఒక మంచి అనుభూతిని అందిస్తుందని చెప్పొచ్చు. ఇంకో ముఖ్య విషయం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పదవీ విరమణ పొందిన అనంతరం సినీ గీత రచయితగా పేరు గడించారు భువన చంద్ర.

28, అక్టోబర్ 2017, శనివారం

రారండోయ్ "జంపింగ్ జపాంగ్"ల వేడుక చూద్దాం

ఇది వర్షాకాలం.  కప్పలకు సందడే సందడి.  రానున్నది ఎన్నికల కాలం.  రాజకీయ "జంపింగ్ జపాంగ్"లకు వేడుకల కాలం.  రాజకీయ పార్టీల ప్రధాన ధ్యేయం, లక్ష్యం - ప్రజాసేవ,సుపరిపాలన.  స్వాతంత్ర్యం సిద్దించిన తొలినాళ్ళలో ప్రజాసేవకు తమ స్వంత ఆస్తులను కూడా కరిగించుకొన్న ప్రజా ప్రతినిధులు ఎందరో వున్నారు. స్వతంత్ర్య పోరాటంలో ఎన్నో బాధలుపడి కూడ,  తదుపరి కోరి వచ్చిన అధికారాన్ని వద్దనుకున్న మహనీయులు కూడా ఎందరో వున్నారు.  మారుతున్న కాలంతోపాటుగా రాజకీయాలలో ఎన్నో మార్పులు.  రాను రాను అక్రమ సంపాదన, అధికార కాంక్షలే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యాలుగా మారిపోయాయి.  గతంలో ఎవరైనా నాయకుడు తన పార్టీని వీడుతున్నాడు అంటే అందుకు ఎంతో బలమైన కారణం,  మరెంతో అంతర్మధనం జరిగేది. ఆ నాయకుడు మరో పార్టీలోకి వెళ్ళాలన్న అంతే ప్రక్రియ జరిగేది.  మరి నేడు..?  ఉదయం బండబూతులు తిట్టిన పార్టీ అధ్యక్షుడి చేతే పార్టీ కండువా కప్పించుకొని,  ఆ వెంటనే తన పాత పార్టీని,  నాయకులను దుమ్మెత్తిపోస్తునారు.  ఇంత త్వరగా రంగులు మార్చడం తమకు కూడా సాద్యంకాదని ఊసరవెల్లులు ఆశ్చర్య పోతుంటే,  ఈ "జంపింగ్ జపాంగ్"ల గంతుల ముందట తామేపాటి అని కప్పలు నోరు వెళ్ళబెడుతున్నాయి.  దీనికి దాదాపు అన్నిపార్టీల భాద్యత ఉంది. నాయకుల ఆర్ధిక, వర్గ, సామాజిక బలం చూసి ,తాయిలాలు ఆశ పెట్టి పార్టీలోకి లాక్కొంటున్నాయి.   ఆ వచ్చిన వారికి వెంటనే పార్టీ పదవులు, ఎన్నికలలో సీట్లు ఇచ్చి ప్రధాన్యత ఇస్తున్నారు. ముందుగా మారాల్సింది పార్టీల నడవడికే.  నాయకులు పార్టీలు మారినంత తేలికగా కార్యకర్తలు మనసు చంపుకొని పార్టీలు మారలేరు.  ఏ కొందరో తప్పించి అసలైన కార్యకర్తలు పార్టీ అధికారంలో వున్నా, లేకున్నా వెన్నంటే వుంటారు.  పార్టీలకు అసలైన బలం, పునాదులు వీరే.  వాళ్ళ కుటుంబాలు తరతరాలుగ పార్టీని అంటే పట్టుకొని వుంటారు.  అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుంది.  అప్పుడు కార్యకర్తలలోనే కాదు, ప్రజలలో కూడా పార్టీ పట్ల నిబద్దత ఏర్పడుతుంది. తరచుగా పార్టీలు మారే  "జంపింగ్ జపాంగ్"లు  కూడా తమ దూకుడు తగ్గించుకుంటారు.  వీరు తమ పార్టీ మారడానికి చెప్పే ఏకైక కారణం "ప్రజల క్షేమం కోసమే".  నిజానికి ఇటువంటి నాయకులు అసలు రాజకీయలలో     వుండక పోవడమే     ప్రజలకు క్షేమం కదా..! ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి విన్యాసాలు తిలకించడానికి సిద్దంగా వుండండి.       

25, అక్టోబర్ 2017, బుధవారం

నేటి ఈనాడులో ప్రజారోగ్యంపై అమూల్యమైన ఆర్టికల్

వ్యాసకర్త పి.ఎస్. ఎం. రావు. సమాజంలో వాస్తవ పరిస్తుతులకు అద్దం పట్టిన వ్యాసమిది. విషయ పరిజ్ఞానంతోనే సరిపుచ్చక, క్షేత్ర స్థాయిలో స్వతహ్ సిద్ద పరిశీలనానుభవంతో రాసిన ఇటువంటి ఆర్టికల్స్ అరుదుగా తారసిల్లుతాయి. ప్రాధమిక వైద్యం కూడా సామాన్యునికి గగనమౌతున్న నేటి రోజుల్లో, తీవ్ర, ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న బెంగతోనే వున్న ప్రాణాలు కూడా ముందే హరీ అంటున్నాయి. ఎంతో ప్రాముఖ్యమైన ప్రజారోగ్యంపై పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, చూపే నిర్లక్ష్యం మాత్రం మారడం లేదు.వైద్య విద్య అంతకంతకూ ఖరెదుగా మారడంతో, వైద్య రంగంలో మానవతా విలువలకు గ్రహణం పడుతుంది. ప్రజారోగ్య పరిరక్షణలోని ప్రస్తుత లొసుగులను నిర్ధాక్షిణ్యంగా ఎండగట్టింది ఈ వ్యాసం. ప్రభుత్వాలు కళ్ళు తెరచి, వైద్య విధానంలోని కుళ్ళును ప్రక్షాళించాసిన తక్షణ తరుణమిది. ప్రజలు ప్రభుత్వాలను గొంతెమ్మకోరికలు కోరడం లేదు. కనీస ఆరోగ్య భధ్రతను అర్ధిస్తున్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లాంటి వారు గళం వినిపిస్తున్నా, ఆలకించేవారేరి.

17, అక్టోబర్ 2017, మంగళవారం

ఎట్టకేలకు తెలుగు దేశం "బుట్ట"లోకి రేణుక

సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో అధికార "సైకిల్" స్పీడ్ పెంచింది.  తెలంగాణా లోని అధికార టి ఆర్ ఎస్ పార్టీ తన ప్రణాళికలో భాగంగా 13 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఖాతాలో జమ చేసుకొని టి డి పి కి  కోలుకోలేని షాక్ ఇచ్చింది.  ఈ అనుభవాన్నే పాఠంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో 21 మంది వై సి పి ఎమ్మెల్యేల కు   పార్టీ కండువాలు కప్పేసింది   అధికార తెలుగు దేశం.  అందులో 4రిని మంత్రులు కూడా చేసి పారేసింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇద్దరు వైసిపి ఎంపీలు టిడిపి పంచన చేరారు.  అప్పటి నుండి ఏదో చోటా,మోటా నేతలు, కార్యకర్తలు తప్ప పెద్ద తలకాయలు తప్పిపోకుండా ఇప్పటి వరకు బాగానే కాచుకున్నారు జగన్.  తాజగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపి లోకి సర్దుకోవడం వైసిపి కి కలవరం కలిగించే అంశమే. కాకపోతే రేణుక చాలా కాలంగా తెలుగుదేశం లోకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. రేణుక భర్త నీలకంఠం టిడిపి లోనే వున్నా అంత క్రియాశీలకంగా లేరు. ఎన్నికలకు తరుణం సమీపించే కొద్ది అధికార పక్షం దూకుడు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. మరో ప్రక్క జనసేన కూడా తలుపులు బార్లా తెరచే వుంచింది. వీటిని తట్టుకొని వైసిపి శ్రేణులను జగన్  ఎన్నికలకు ఎలా సిద్దం చేస్తారన్న  విషయమై  విశ్లేషకులు  ఆసక్తిగా వున్నారు. 

ప్రారంభమైన కోహ్లి - రవిశాస్త్రి ల "హీట్ మూన్" డేస్

విరాట్ కోహ్లి- అనుష్కల వివాహం, హనీమూన్ లు జరిగి కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడే సంసారంలో గొడవలా అని ఆశ్చర్యపోకండి. ఇది పెళ్ళికి సంబం...