24, ఆగస్టు 2017, గురువారం

నంద్యాలలో టిడిపి దే గెలుపు : లగడపాటి

80% పోలింగ్ నమోదైన నంద్యాల లో టిడిపియే సీటు గెలుచుకోనుందని మాజీ ఎంపి లగడపాటి స్పష్టం చేస్తున్నారు. లగడపాటి స్వయంగా చేయించే సర్వేల పై ప్రజలలో మంచి విస్వసనీయత వుంది. దివంగత రాజశేఖర్ రెడ్డి కూడా రాజగోపాల్ అద్యయనాలకు విలువ ఇచ్చేవారని ఆయన అనుయాయులు అంటుంటారు. గత కొద్ది కాలంగా టిడిపితో రాసుకు పూసుకు తిరుగుతున్నందున, ఇది రాజగోపాల్ చేస్తున్న గిమ్మిక్ గా వైసీపి శ్రేణులు కొట్టిపారేస్తున్నాయి. ఇందులో కొంత వాస్తవం లేక పోలేదు. సమైఖ్య రాష్ట్రం విడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని సవాల్ చేసిన లగడపాటి - తదనంతర పరిణామాలతో ఇన్నాళ్ళు రాజకీయాలకు దూరంగా వుంటూ మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే వుంటూ సమైఖ్యాంద్రకు గట్టి మద్దతుదారుగా నిలచిన లగడపాటి పై తెలంగాణా కాంగ్రెస్ నేతలతో పాటు, ఢిల్లి అధిష్టానం కూడా కన్నెర్ర చేసింది. నాడు లగడపాటితో పాటు అధికారాన్ని అనుభవించిన సహచర నేతలు చాలామంది రాష్ట్ర విభజనానంతరం  టిడిపి,  వైసిపి,  బిజెపిలలో ఆశ్రయం సంపాదించి సెటిల్ అయిపోయారు. రాజగోపాల్ మాత్రం నాటి నుండి నుండి క్రియాశీల రాజకీయాలకు దూరంగానే వున్నారు. గత కొద్ది కాలంగా టిడిపి నేతలతో లగడపాటి చెట్టపట్టాలు వేసుకు తిరుగుతున్నారు. నిజానికి లగడపాటి వంటి నాయకుడ్ని ఏ పార్టీ అయినా ఆదరంగా అక్కున చేర్చుకుంటుంది. రాజకీయాలలో శాస్వత శతృత్వం, శాస్వత మితృత్వం వుండనట్టే  శాస్వత ప్రమాణాలు, శాస్వత వాగ్దానాలు కూడా  వుండవేమో   కదా!    

19, ఆగస్టు 2017, శనివారం

బోరు బావిలో నిలిచిన ప్రాణం

నిర్లక్ష్యంగా వదిలివేస్తున్న బోరు బావులలోపడి బాలలు మరణిస్తున్నా- తగిన రక్షణ చర్యలు  కొరవడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్ట్ 15వ తేది సాయంత్రం 3.30 ని. సమయంలో గుంటూరు జిల్లా వినుకొండ మండలం వుమ్మడివరం గ్రామ పొలాలలోని బోరు బావిలో చంద్రశేఖర్ అనే రెండు సంవత్సరాల బాలుడు పడిపోయాడన్న వార్త తెలియగానే - ఎక్కడ మరో విషాద వార్త వినాల్సి వస్తుందోనని అందరూ కలవర పడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్, రెవెన్యూ, వైద్య ఆరొగ్య శాఖలు హుటా హుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు ప్రారంభించాయి.  ఎన్ డి ఆర్ ఎఫ్ దళాలు కూడా చేరుకుని రంగంలోకి దిగాయి. జిల్లా ఎస్పీ, కలెక్టర్ లతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆంజనేయులు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రొక్లెన్లను వుపయోగించి బోరుబావికి సమాంతరంగా గుంత తవ్వడం ప్రారంభించారు. మరో ప్రక్క బాలుడుకి పైప్ ద్వార ఆక్సిజన్ అందించారు. ఒక ప్రక్క భారీ వర్షం కురవడం మరింత ఆందోళనకు దారి తీసింది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు ఫొన్ ద్వార పరిస్థితిని సమీక్షించారు. తెల్లవారుజాము మూడు గంటల ప్రాంతంలో బాలుడిని సజీవంగా బయటకు తీయడంతో ఒక్కసారిగా ఆ ప్రదేశంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి.    ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వ శాఖలన్నీ, సమన్వయంతో స్పందించి అందించిన సహాయక చర్యలు అమోఘం. ఇకనైనా మరలా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. దాదాపు ఈ సంఘటనలు గ్రామాలలోనే జరుగుతున్నందున అన్ని గ్రామపంచాయితీలు - నిరుపయోగంగా వున్న బోరుబావులు మూసివేతకు  తీర్మానాలు చేపట్టేల ఆదేశాలు జారీ చేయాలి. తక్షణమే తనిఖీ బృందాలను క్షేత్ర స్థాయిలో పరిశీలనకు పంపి నిబందనలు పాటించని వారికి భారి జరిమానాలు,శిక్షలు విధించేలా చూడాలి. పసి ప్రాణాలను కబళిస్తున్న బోరుబావుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి ఒక్కరి భాద్యత.   

15, ఆగస్టు 2017, మంగళవారం

ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకుంది జగనా? చంద్రబాబా?


ఆశ్చర్యం లేదు. ఎన్నికల ఎత్తుగడల నిపుణుడిగా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన ప్రశాంత్ కిషోర్ ను  రాబోవు ఎన్నికలలో విజయ ప్రణాళికలు రచించడానికి జగనే తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్నారు.  ప్రశాంత్ రావడం, రావడం తన మార్క్ సర్వేలతో రంగంలోకి దూకేసారు.  పనిలో పనిగా నంద్యాల ఉప ఎన్నిక కూడా తోడవడంతో, తన వ్యూహాస్త్రాల పదును పరీక్షించుకోవడానికి మంచి వేదిక దొరికింది.  ఆయన సూచనల మేరకే జగన్ ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయి వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విరుచుకుపడుతున్నారు. ఎన్నికల సంఘం నోటీసులు జారి చేసినా, జగన్ ఏ మాత్రం వెనుకకు తగ్గడం లేదు. నిరంతరం జగన్,  వైసిపి గురించి  ప్రజలు,  మీడియ చర్చించుకొనేల చేయడమే  ప్రశాంత్ ఈ వ్యూహానికి  కారణమని విశ్లేషకులు అంటున్నారు.  ప్రస్తుత పరిస్తితులలో ఈ విధానం సరైనదేనా..?  వైసిపికి ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది..?  ప్రశాంత్ వ్యూహాలు వైసిపికి మేలు చేస్తున్నాయా..? కీడు చేస్తున్నాయా..?  ఒకసారి విశ్లేషించుకుందాం.    చిన్న స్థాయి ప్రాంతీయ పార్టీ నుండి,  బిజెపి, కాంగ్రెస్ పార్టీల వరకు ప్రతి పార్టీకి తెర వెనుక  చిన్నదో,  పెద్దదో మేధావుల బృందం వుంటుంది. ఇందులో సిద్ధాంత కర్తలు, వ్యూహకర్తలు,  సలహాదారులు,  విశ్లేషకులు వుంటారు.  వీరు ఎప్పుడూ తెర వెనుక వుండి మంత్రాంగం నడిపించడమేగాని,  స్టేజ్ పై ఏ పాత్ర పోషించరు.  ప్రశాంత్ రాక సందర్భంగా జరిగిందేమిటి..?  ఒక స్టార్ ఫాలోయింగ్ వున్న నటుడో,  క్రీడాకారుడో  పార్టిలోకి వస్తున్నట్లుగా  ఆర్భాటం జరిగింది.  చాపకింద నీరులా జరగాల్సిన వ్యవహారాన్ని అత్యుత్సాహంతో  పందిరి వేసి, పటాసులు కాల్చి హడావుడి చేసినట్లయ్యింది.  సాదారణంగా వ్యూహకర్తలు హంగు, ఆర్భటాలకు చాలా దూరంగా వుంటూ  తమ మంత్రాంగంలో తలమునకలై వుంటారు.  అది వారి వృత్తి లక్షణం.  దేశంలోని ప్రముఖ వ్యూహకర్తతో అనుబంధం ఏర్పడిన ఆనందంలో జగన్ తమ పార్టీ ప్లీనరీ వేదికపైకి  ప్రశాంత్ ను ఆహ్వానించి,  ప్రాధాన్యత ఇచ్చి వుండవచ్చు.  కాని,  ఒక రాజకీయ మంత్రాంగ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా- ఇది సరి అయిన  విధానం  కాదని జగన్ కు సున్నితంగా చెప్పాల్సిన భాద్యత ప్రశాంత్ పై వుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది..? ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక భావనలు వెలుగుచూస్తున్నయని  మదనపడుతున్న టిడిపి శ్రేణులకు  ప్రశాంత్ కిషోర్  రూపంలో ఒక మంచి అవకాశం చిక్కినట్లయ్యింది.  ఇక నుంచి ప్రశాంత్ కనుసన్నల్లోనే  జగన్ వ్యవహరిస్తారని,  ప్రశాంత్ సర్వేల్లో చాల మంది సిట్టింగ్ లకు చాన్స్ లు గల్లంతవుతున్నాయని, జగన్ తరువాత నెంబర్ టూ గా పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ప్రశాంత్ యేనని మైండ్ గేం స్టార్ట్ చేసాయి టిడిపి శ్రేణులు. వైసిపిలో ఉద్ధండ పిండాలు ఎన్నో వున్నా,  నెంబర్ టూ స్థానం ఖాళీగానే వుంటుంది.   విజయమ్మ,  షర్మిళలు వున్నప్పటికి- వారు ఎన్నికలు మరియు ముఖ్య సమావేశాలలో తప్ప కనిపించకపోవడం ఈ వ్యాఖ్యలకు ఊతం ఇస్తున్నాయి.  ఈ విధమైన వాతావరణం వలన పార్టీలో సీనియర్లను కూడా కాదని ప్రశాంత్ బృందం చుట్టు కోటరి ఏర్పడే ప్రమాదం వుంది.  పార్టీకి ఇది ఎంతవరకు మేలు చేస్తుంది..?  మరో ముఖ్య విషయం.   వైసిపి నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొనేల చేయడం ఎంతవరకు సబబు..?   ఇది కేవలం ఒక ఎమెల్యే మరణించడంతో వచ్చిన ఉప ఎన్నిక మాత్రమే.   వివిధ కారణాల వల్ల, కొన్ని సీట్లలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పార్టీల ట్రెండ్ తెలుస్తుంది.   ఏదో ఒకటి రెండు స్థానాల్లో ప్రాతినిధ్య సభ్యులు మరణించిన చోట్ల జరిగే ఎన్నికలను రిఫరెండంగా ఎలా భావిస్తారు..?   ఇటువంటి చోట్ల చనిపోయిన వ్యక్తి కుటుంబానికే సీటు కేటాఇంచడం,   వారు గెలవడం అన్నది సర్వసాధారణంగా జరిగేదే.   ఇప్పుడు నంద్యాల వుప ఎన్నిక కూడా అటువంటిదేగా..?    సానుభూతికి తోడు, అధికార పార్టీ కావడం మరింత అదనపు లాభం టిడిపి అభ్యర్ధికి.  ఈ ఉప ఎన్నిక వాస్తవానికి టిడిపికే ప్రతిష్టాత్మకంగాని,   వైసిపికి ఎంత మాత్రం కాదు.  ఈ ఎన్నికను ఒక సవాల్ గాను,  2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గాను భావించేలా చేయడం,  జగన్ ను నంద్యాలలోనే మకాం పెట్టించడం ప్రశాంత్ వ్యూహాత్మిక   తప్పిదంగా కనిపిస్తుంది. రేపు ఎన్నికలో విజయం సాధిస్తే వైసిపికి అద్భుతమైన మైలేజ్ వస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.  ప్రశాంత్ కు కూడా మంచి గౌరవం దక్కుతుంది.   ఇంతా చేసి ఫలితం ప్రతికూలంగా వస్తే, ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రభావం చూపించే అవకాశాలు పుష్కలంగా వుంటాయి.  ఇప్పుడు ఈ ఎలక్షన్ ను మేము ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు అనే అవకాశం వైసిపికి లేదు.   సరి కదా, ఖచ్చితంగా టిడిపి శ్రేణులు  ప్రశాంత్ ఎత్తుగడలు అన్ని వుత్త ఢాంభికాలుగా ఎద్ధేవ చేస్తాయనడంలొ మరో మాట లేదు.  ఇప్పుడిప్పుడే అధికార పక్షం నుండి ప్రతిపక్షం వైపు దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న " జంపింగ్ జపాంగ్ " లు తమ నిర్ణయంపై పునరాలోచన చేసుకొనే పరిస్తితి వస్తుంది.   ప్రచారంలో భాగంగా జగన్ చేత తీవ్ర వ్యాఖ్యలు చేయించడం కూడా వివాద్స్పద వ్యూహంగా మారిపోయింది. ఒక లక్ష్యం కోసం చేసే వుధ్యమాలకు ఈ తరహా మాటలు చెల్లుతాయి కాని, రాజకీయ ప్రయోజనం ముడిపడిన ఎన్నికలలో ఆమోదయోగ్యం పొందడమన్నది కొంచెం ఇబ్బందికరమైనదే. ఇందుకు ఒక మంచి వుదాహరణ తెలంగాణ సిఎం కేసీఅర్.   వుద్యమ సమయంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన కెసీఅర్ తదుపరి ఎన్నికల క్షేత్రంలో ప్రసంగాలలో వచ్చిన మార్పును స్పష్టంగా తెలుసుకోగలం.  ఏది ఏమైనా  ప్రస్తుత పరిస్థితిబట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ వ్యవహారం కోరి తెచ్చుకున్న కొరివి కాదుకదా అని పార్టీ వాళ్ళే అనుకునేలా వుంది.         

13, ఆగస్టు 2017, ఆదివారం

ప్రొ. కబడ్డి నేర్పుతున్న పాఠం

మానసిక, శారీరక ఉల్లాసాన్నిచ్చే - అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డి.  భారత  గ్రామీణ యువత వారసత్వ సంపద కబడ్డి. క్రికెట్ మోజులోపడి  జాతీయ క్రీడ హాకి వంటి క్రీడలే ఉసూరంటుంటే.. మరి కబడ్డి వంటి పల్లె క్రీడల పరిస్థితి ఎలా వుంటుంది..?  అనాదిగా పొటీలు నిర్వహిస్తున్న కొన్ని సంఘాలు పండుగలు, ప్రత్యేక సందర్భాలలో జరిపే పోటీలు  తప్ప  మరి ఎటువంటి ఆదరణ వుండేది కాదు.  భారత వుపఖండంలో పురుడుపొసుకున్న క్రీడ కావడంచేత ఆసియా దాటి అంతర్జాతీయంగా  ఈ ఆట ప్రాచుర్యం పొందలేక పోతుంది.  ఎప్పుడైతే కార్పొరేట్ కన్నుపడి ప్రొ.కబడ్డి రూపుదిద్దుకొందో అప్పుడే ఈ పల్లెటూరి ఆట దశ తిరిగింది.  2014లో ప్రారంభమైన ఈ లీగ్ అంతకంతకు ప్రాచుర్యం పొందుతూ భారీ స్తాయిలో విజయవంతం అయ్యింది.  ఈ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రాంతీయ చానల్స్ లో, ప్రాంతీయ భాషలలో ప్రసారం జరుగుతున్నపటినుండి  మరింతగా పాపులర్  అయ్యింది. వీక్షకాదరణ కారణంగా గత సంవత్సరం  రెండుసార్లు నిర్వహించారంటే  పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు.  ప్రొ. కబడ్డి స్టార్ ఆటగాళ్ళు రాహుల్ చౌదరి, అనూప్ కుమార్, మంజిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, పరదీప్ నర్వాల్ తదితరులు ఈ రోజు  ఫేమస్ సెలెబ్రిటీలు. టెండూల్కర్  కంటే కూడా  రాహుల్ చౌదరి నేడు తెలుగు కుటుంబాలలో పాపులర్. రాహుల్ ని హీరొగా పెట్టి తెలుగు సినిమా తీయడానికి లోగడ గట్టి ప్రయత్నాలే జరిగాయి.  కబడ్డి క్రీడకు అందిస్తున్న సహకారంలానే గ్రామీణ చేతి వృత్తులకు, వ్యవసాయానికి, కళలకు, అనుబంద పరిశ్రమలకు కార్పొరేట్  ప్రపంచం సహకారం అందిస్తే దేశ ముఖ చిత్రమే మారిపొతుంది. పవన్ కల్యాణ్, సమంతలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వుంటామన్నరు. ఈ ప్రభుత్వాలు వారి సేవలను ఎంత వరకు వినియోగించుకున్నాయి..?   అరకులో పండించే కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వుంది.  ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎంత మంది మనలో వినియోగిస్తున్నారు? ఏ ప్రాంతాలలో అందుబాటులో వుంది?  నాంది ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ అక్కడి గిరిజనులకు కాఫీ పండించడంలోను, మార్కెటింగ్, పంపిణీ, పరిశోదనలలో దన్నుగా నిలుస్తుంది.  అదే కార్పొరేట్ సహకారం లభిస్తే తెలుగు కాఫీ రుచులు విశ్వ వ్యాప్తంగా గుబాలించడంతోపాటు గిరిజనుల కుటుంబాలలో వెలుగులు మరియు రాష్త్రానికి మంచి ఆదాయ మార్గం అవుతుంది.  స్వచ్చత, స్వదేశీ నినాదంతో అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయల వ్యాపార స్థాయికి చేరుకొని- విదేశీ సంస్థలకే వ్యాపార సూత్రాలను నేర్పుతున్నది "పతంజలి" సంస్థ.   మరి మన గిరిజన సహకార సంస్థ వారి వుత్పత్తులు పతంజలి వుత్పత్తులలానే  ఎంతో విశిష్టమైనవి. కావాల్సిందల్లా ప్రచారము, ప్రోత్సాహము. ప్రభుత్వ హస్తకళల సంస్థ లేపాక్షిని కార్పొరేట్ సహకారంతో పరిపుష్టం చేసి ఏటి కొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మలకు జీవం పోయవచ్చు. డ్వాక్రా మహిళా సంఘాల వారికి కార్పొరేట్ సహకారంతో పచ్చళ్ళు, పొడులు, పిండి వంటలు తదితర తయారీలలో శిక్షణ, మార్కెటింగ్ వంటి అంశాలు నేర్పించి ఒక బ్రాండ్ ద్వారా వారి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించవచ్చు. ఏది ఏమైనా, తాము ఎదుగుటకు సహకరించిన సమాజానికి ఎంతో కొంత సాయం అందించాలన్న ఆలోచన బడా కార్పొరేట్ సంస్థలకు వుండాలి.  అలాగే అటువంటి సంస్థలని గుర్తించి, ఈ విధానంలో ప్రోత్సహించి, పర్యవేక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వాలపైనా వుంది.  

12, ఆగస్టు 2017, శనివారం

" జనసేన " పయనం ఎటూ..?

రాష్ట్ర విభజనానంతర పరిస్థుతులలో పురుడు పోసుకుని, కాంగ్రెస్ వ్యతిరేక అజెండాతో 2014 అసెంబ్లీ ఎన్నికలలో కీలక పాత్ర పొషించింది జనసేన.  ప్రత్యక్షంగా ఎన్నికలలో పాల్గొనకున్నా- కాంగ్రెస్ వ్యతిరేకతతో,  టిడిపి+బిజెపి  కూటమికి పరొక్ష మద్దతు ప్రకటించడమే కాకుండా, ప్రచారంలో పాల్గొని వారి విజయంలో భాగస్వామ్య పాత్ర పోషించారు పవన్.  ప్రజా సమస్యలపై ప్రశ్నించడమె ధ్యేయమన్న పవన్- తదనంతర పరిణామాలలో రాజధాని భూసేకరణ, ప్రత్యేక హోదా,  వుద్ధానం కిడ్నీ బాధితులు విషయాలలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని బహిరంగంగానే నిలదీశారు. అయినప్పటికి పవన్ విషయంలో సమ్యమనం పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టిడిపి వర్గాలకు సూచించారు. దానితో తెలుగు తమ్ముళ్ళు కొంచెం వేడి తగ్గించారు. జనసేన 2019 లో జరుగనున్న ఎన్నికలలో  ప్రత్యక్ష్యంగా బరిలోకి దిగనున్నదని పవన్ ప్రకటించడంతో  ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలలో  స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. ఇంతవరకు వున్న టిడిపి, బిజేపిలతోనే  పొత్తు పెట్టుకుంటుందా?  లేక ప్రభుత్వ వ్యతిరేక కారణాలతో  వైసిపితోగాని,  కమ్యూనిస్టులతోగాని కలిసినడుస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. జనసేన నిర్ధిష్ట విధానం తెలియకపోవడంతో ప్రస్తుతం అన్ని పార్టీలు ఆశావహ దృక్పధంతోనే వున్నాయి.  'పార్ట్ టైం పొలిటీషియన్ ' అని కొందరు నాయకులు విమర్శిస్తున్నప్పటికి  పవన్ లేవనెత్తుతున్న సమస్యలు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తున్నవే కావడం గమనార్హం.వీటికి ప్రజల నుండి భారి ఎత్తున స్పందనలు వస్తున్నాయి. పవన్ పూర్తి స్తాయి కార్యక్షేత్రంలోకి వస్తే సమీకరణలు మారిపోయే అవకాశం వుంది. ప్రజారాజ్యం  కూడా  ఎన్నికల ముందు ఇంతకంటే బలంగా కనిపించిందని,  ఎలక్షన్స్ లో పట్టుమని 20 సీట్లు కూడా సాధించలేక చతికిల పడిందని రాజకీయ విశ్లేషకులు అంటుండొచ్చు.  కాని అప్పటికి  ఇప్పటికి పవన్ రాజకీయంగా ఎంతో పరిణతి, అవగాహన సాధించారన్నది కాదనలేని వాస్తవం. అప్పటి ప్రజారాజ్యం సాధించిన సీట్లలో సగం జనసేన సాధించినా - ఇప్పటి చిన్న రాష్ట్రంలో అవి ఎంతో ప్రభావం చూపించే అవకాశం వుంది.  జనసేన తెలుగు దేశం వోట్లను చీల్చి వైసిపికి లాభం చేకూరుస్తుందా..?  సామాజికపరంగా తెలుగు దేశం అన్యాయం చేసిందని  వైసిపికి దగ్గరవుతున్న కాపు సామజిక వర్గ వోట్లను చీల్చి టిడిపికి మళ్ళి అదికారాన్ని అప్పగిస్తుందా..?  అన్నది విష్లేషకుల అంచనాలకు సైతం అందడం లేదు.  ఇటుప్రక్క పవన్ రాజకీయంగా స్పష్టమైన నిర్ణయాలు ఇప్పటికీ తీసుకోలేకపోతుండడం పార్టీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.  నంద్యాల వుప ఎన్నికలలో మద్దతు విషయమై ఇంతవరకు ఎటూ తేల్చుకోలేకపోతున్న పవన్ - ముందు ముందు మరెన్నొ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన   పరిస్థితులలో  ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరమే..!   ఏది ఏమైనా జనసేన గమనంపై అన్ని రాజకీయ పక్షాలు ఎంతో ఆసక్తితో వున్నాయన్నది వాస్తవం. మరి జన సేనాని పయనం ఎటో...?        

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...