28, అక్టోబర్ 2017, శనివారం

రారండోయ్ "జంపింగ్ జపాంగ్"ల వేడుక చూద్దాం

ఇది వర్షాకాలం.  కప్పలకు సందడే సందడి.  రానున్నది ఎన్నికల కాలం.  రాజకీయ "జంపింగ్ జపాంగ్"లకు వేడుకల కాలం.  రాజకీయ పార్టీల ప్రధాన ధ్యేయం, లక్ష్యం - ప్రజాసేవ,సుపరిపాలన.  స్వాతంత్ర్యం సిద్దించిన తొలినాళ్ళలో ప్రజాసేవకు తమ స్వంత ఆస్తులను కూడా కరిగించుకొన్న ప్రజా ప్రతినిధులు ఎందరో వున్నారు. స్వతంత్ర్య పోరాటంలో ఎన్నో బాధలుపడి కూడ,  తదుపరి కోరి వచ్చిన అధికారాన్ని వద్దనుకున్న మహనీయులు కూడా ఎందరో వున్నారు.  మారుతున్న కాలంతోపాటుగా రాజకీయాలలో ఎన్నో మార్పులు.  రాను రాను అక్రమ సంపాదన, అధికార కాంక్షలే రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యాలుగా మారిపోయాయి.  గతంలో ఎవరైనా నాయకుడు తన పార్టీని వీడుతున్నాడు అంటే అందుకు ఎంతో బలమైన కారణం,  మరెంతో అంతర్మధనం జరిగేది. ఆ నాయకుడు మరో పార్టీలోకి వెళ్ళాలన్న అంతే ప్రక్రియ జరిగేది.  మరి నేడు..?  ఉదయం బండబూతులు తిట్టిన పార్టీ అధ్యక్షుడి చేతే పార్టీ కండువా కప్పించుకొని,  ఆ వెంటనే తన పాత పార్టీని,  నాయకులను దుమ్మెత్తిపోస్తునారు.  ఇంత త్వరగా రంగులు మార్చడం తమకు కూడా సాద్యంకాదని ఊసరవెల్లులు ఆశ్చర్య పోతుంటే,  ఈ "జంపింగ్ జపాంగ్"ల గంతుల ముందట తామేపాటి అని కప్పలు నోరు వెళ్ళబెడుతున్నాయి.  దీనికి దాదాపు అన్నిపార్టీల భాద్యత ఉంది. నాయకుల ఆర్ధిక, వర్గ, సామాజిక బలం చూసి ,తాయిలాలు ఆశ పెట్టి పార్టీలోకి లాక్కొంటున్నాయి.   ఆ వచ్చిన వారికి వెంటనే పార్టీ పదవులు, ఎన్నికలలో సీట్లు ఇచ్చి ప్రధాన్యత ఇస్తున్నారు. ముందుగా మారాల్సింది పార్టీల నడవడికే.  నాయకులు పార్టీలు మారినంత తేలికగా కార్యకర్తలు మనసు చంపుకొని పార్టీలు మారలేరు.  ఏ కొందరో తప్పించి అసలైన కార్యకర్తలు పార్టీ అధికారంలో వున్నా, లేకున్నా వెన్నంటే వుంటారు.  పార్టీలకు అసలైన బలం, పునాదులు వీరే.  వాళ్ళ కుటుంబాలు తరతరాలుగ పార్టీని అంటే పట్టుకొని వుంటారు.  అటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వుంది.  అప్పుడు కార్యకర్తలలోనే కాదు, ప్రజలలో కూడా పార్టీ పట్ల నిబద్దత ఏర్పడుతుంది. తరచుగా పార్టీలు మారే  "జంపింగ్ జపాంగ్"లు  కూడా తమ దూకుడు తగ్గించుకుంటారు.  వీరు తమ పార్టీ మారడానికి చెప్పే ఏకైక కారణం "ప్రజల క్షేమం కోసమే".  నిజానికి ఇటువంటి నాయకులు అసలు రాజకీయలలో     వుండక పోవడమే     ప్రజలకు క్షేమం కదా..! ఎన్నికలు సమీపిస్తున్న వేళ వీరి విన్యాసాలు తిలకించడానికి సిద్దంగా వుండండి.       

25, అక్టోబర్ 2017, బుధవారం

నేటి ఈనాడులో ప్రజారోగ్యంపై అమూల్యమైన ఆర్టికల్

వ్యాసకర్త పి.ఎస్. ఎం. రావు. సమాజంలో వాస్తవ పరిస్తుతులకు అద్దం పట్టిన వ్యాసమిది. విషయ పరిజ్ఞానంతోనే సరిపుచ్చక, క్షేత్ర స్థాయిలో స్వతహ్ సిద్ద పరిశీలనానుభవంతో రాసిన ఇటువంటి ఆర్టికల్స్ అరుదుగా తారసిల్లుతాయి. ప్రాధమిక వైద్యం కూడా సామాన్యునికి గగనమౌతున్న నేటి రోజుల్లో, తీవ్ర, ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తే ఎలా ఎదుర్కోవాలో అన్న బెంగతోనే వున్న ప్రాణాలు కూడా ముందే హరీ అంటున్నాయి. ఎంతో ప్రాముఖ్యమైన ప్రజారోగ్యంపై పాలక ప్రభుత్వాలు ఎన్ని మారినా, చూపే నిర్లక్ష్యం మాత్రం మారడం లేదు.వైద్య విద్య అంతకంతకూ ఖరెదుగా మారడంతో, వైద్య రంగంలో మానవతా విలువలకు గ్రహణం పడుతుంది. ప్రజారోగ్య పరిరక్షణలోని ప్రస్తుత లొసుగులను నిర్ధాక్షిణ్యంగా ఎండగట్టింది ఈ వ్యాసం. ప్రభుత్వాలు కళ్ళు తెరచి, వైద్య విధానంలోని కుళ్ళును ప్రక్షాళించాసిన తక్షణ తరుణమిది. ప్రజలు ప్రభుత్వాలను గొంతెమ్మకోరికలు కోరడం లేదు. కనీస ఆరోగ్య భధ్రతను అర్ధిస్తున్నారు. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లాంటి వారు గళం వినిపిస్తున్నా, ఆలకించేవారేరి.

17, అక్టోబర్ 2017, మంగళవారం

ఎట్టకేలకు తెలుగు దేశం "బుట్ట"లోకి రేణుక

సార్వత్రిక ఎన్నికలు ముందుగానే వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో అధికార "సైకిల్" స్పీడ్ పెంచింది.  తెలంగాణా లోని అధికార టి ఆర్ ఎస్ పార్టీ తన ప్రణాళికలో భాగంగా 13 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఖాతాలో జమ చేసుకొని టి డి పి కి  కోలుకోలేని షాక్ ఇచ్చింది.  ఈ అనుభవాన్నే పాఠంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో 21 మంది వై సి పి ఎమ్మెల్యేల కు   పార్టీ కండువాలు కప్పేసింది   అధికార తెలుగు దేశం.  అందులో 4రిని మంత్రులు కూడా చేసి పారేసింది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఇద్దరు వైసిపి ఎంపీలు టిడిపి పంచన చేరారు.  అప్పటి నుండి ఏదో చోటా,మోటా నేతలు, కార్యకర్తలు తప్ప పెద్ద తలకాయలు తప్పిపోకుండా ఇప్పటి వరకు బాగానే కాచుకున్నారు జగన్.  తాజగా కర్నూలు ఎంపి బుట్టా రేణుక టిడిపి లోకి సర్దుకోవడం వైసిపి కి కలవరం కలిగించే అంశమే. కాకపోతే రేణుక చాలా కాలంగా తెలుగుదేశం లోకి వెళ్ళిపోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. రేణుక భర్త నీలకంఠం టిడిపి లోనే వున్నా అంత క్రియాశీలకంగా లేరు. ఎన్నికలకు తరుణం సమీపించే కొద్ది అధికార పక్షం దూకుడు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కరలేదు. మరో ప్రక్క జనసేన కూడా తలుపులు బార్లా తెరచే వుంచింది. వీటిని తట్టుకొని వైసిపి శ్రేణులను జగన్  ఎన్నికలకు ఎలా సిద్దం చేస్తారన్న  విషయమై  విశ్లేషకులు  ఆసక్తిగా వున్నారు. 

13, అక్టోబర్ 2017, శుక్రవారం

అంతర్జాతీయ ఆన్ లైన్ సంస్థ అమెజాన్ కే అంటకత్తెర వేసిన గడుగ్గాయిలు

సాధారణంగా ఆన్ లైన్ ద్వారా కొన్న వస్తువులు నాణ్యంగా లేవనో, డూప్లికేట్ వస్తువులు పంపారనో, అసలు వస్తువులే లేని ఖాళీ బాక్స్ లు పంపించారనో సదరు ఆన్ లైన్ సంస్థలపై ఫిర్యాదులు రావడం సహజం. అందుకు భిన్నంగా అమెజాన్ ఇండియా సంస్థ ఈ సంవత్సరం ఏప్రియల్ - మే నెలలలో 166 ఖరీదైన సెల్ ఫోన్స్ డెలివరీ తీసుకుని, ఆ ఫోన్స్ తమకు చేరలేదని డబ్బులు రిటన్ వేయించుకొని కొందరు మోసం చేసారని ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ మోసానికి కారకులైన శివం చోప్రా, సచిన్ జైన్ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి వారి ఆట కట్టించారు. శివం చోప్రా వేరే వేరే ఫోన్ నంబర్ల ద్వారా తప్పుడు అడ్రస్, ఖాతా దారుల పేర ముందుగా డబ్బులు చెల్లించి,  ఖరీదైన సెల్ ఫోన్స్ బుక్ చేసేవాడు.  డెలివరీ బాయ్స్ ఆ అడ్రెస్ లకు వచ్చి, తెలుసుకోలేక  ఫోన్ చేయగా,  తాను వేరే చోట వున్నానని అక్కడకు వారిని రప్పించుకొని డెలివరీ తీసుకొనేవాడు. తరువాత తనకు ఖళీ బాక్స్ మాత్రమే పంపారని అమెజాన్ కు ఫిర్యాదు చేసి డబ్బులు రిఫండ్ వేయించుకొనే వాడు. ఇందుకు అవసరమైన సిం నంబర్లను సచిన్ జైన్ సమకూర్చి పెట్టేవాడు. ఈ క్రమంలో వీరు 141 ఫోన్ నంబర్లను, 48 మంది తప్పుడు ఖాతదారుల వివరాలను వినియోగించారు.  వీరి వద్ద నుండి 12 లక్షలు,25 సెల్ పోన్స్, 40 వివిద బాంక్ ఖాతా పాస్ బుక్ లను పోలీసులు వశపర్చుకున్నారు.  

8, అక్టోబర్ 2017, ఆదివారం

ఏమయింది ఈ భాగ్యనగరానికి..? ఎవరూ నోరు మెదపరే..?

హైద్రాబాద్ ..విశ్వనగరంగా ప్రస్థావించబడుతున్న మన భాగ్యనగరం. హైద్రాబాద్ అభివృద్ది మా హయాంలో జరిగిందంటే, కాదు.. మా పరిపాలనలోనే జరిగిందని జబ్బలు చరుచుకుంటుంటాయి మన రాజకీయ పక్షాలు. ఇదంతా కాదు నైజాం పాలనలోనే హైద్రాబాద్ ప్రపంచ స్థాయి నగరంగా కీర్తి గడించిందంటారు మరికొంత మంది. ప్రస్తుతం గట్టిగా నాలుగు చినుకులు పడితే హైదరాబాద్ రోడ్లు భారీ జల రవాణా మార్గాలుగా మారిపోతున్నాయి. ఒక మోస్తరు వర్షం వస్తే స్కూల్స్, కాలేజెస్, ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలన్నిటికి సెలవులు ప్రకటించాల్సిందే. సాధారణ ప్రజలు గంటల కొద్ది ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ  వర్షాకాలంలో ఏ ఒక్కరు కూడా ఇది మా ఘనతే అని నోరు విప్పరే..? మహా భారత యుద్దంలో "అశ్వత్థామ హతహ్, కుంజరహ" లానే, ప్రస్తుతం మనం కూడా " హైదరాబాద్ విశ్వనగరం- వర్షాకాలం తప్పించి" అని నినదిద్దామా..! లేకపోతే " వర్షాకాలంలో వెనిస్ నగరాన్ని తలపించే హైదరాబాద్ జల సోయగాలు" అని పర్యాటక ప్రచారం చేసుకొనే అవకాశం ప్రభుత్వానికి కలుగుతుందని సరిపుచ్చుకుందామా..?

6, అక్టోబర్ 2017, శుక్రవారం

సమాజంలోని రాబందుల వికృతం

ఒకప్పుడు ఎవరైన కష్టంలో వుంటే, చుట్టువున్న నలుగురు సాయం అందించడానికి నడుం బిగించేవారు. రాను రాను ఎవరైనా ఆపదలో వుంటే " అయ్యో పాపం" అని జాలి చూపడమే గగనం అయిపోయింది.  ప్రస్తుతం సమాజంలో పరిస్తితులు ఎంతగా దిగజారిపోయాయో ఇటీవలి ముంబై ఎల్విన్ స్టొన్ రైల్వే బ్రిడ్జ్ ప్రమాద దుర్ఘటన కళ్ళకు కట్టింది. తొక్కిసలాటలో మరణించిన వారు, గాయపడిన బాదితులతో ఆ ప్రదేశం విషాద వాతావరణం  అలముకొని భీతావహంగా వుంది. శవాలను పీక్కుతినే రాబందులు కూడా సిగ్గుపడేల- కొన్ని మానవ మృగాలు గాయపడిన మహిళలపై లైంగిక దాడులు, నగదు,నగలు,వస్తువుల అపహరణకు పాల్పడ్డాయి. ఎంత ఘోరం, ఎంత పాపం,ఎంత నికృష్టం అని మానవ సమాజాన్ని చూసి జాలిపడుతున్నాయి అసలు రాబందులు.  

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...