12, నవంబర్ 2017, ఆదివారం

"నాన్నా..! ఇప్పులే వచ్చేయ్" (కథ..? వ్యథ..?)

                 "నాన్నా..నాన్నా...నాన్నా.." రాత్రి పది గంటల సమయంలో నిర్మానుష్యంగా వున్న ఆ వీధిలో నాలుగేళ్ళు నిండిన చింటూ ఏడుపు హృదయ విదారకంగా ప్రతిధ్వనిస్తుంది.
                             దిగులుకమ్మేసిన  మనసుతో  భారంగా మెయిన్ రోడ్ వైపు అడుగులు వేస్తున్న ప్రకాష్  చెవులకు తన కొడుకు ఏడుపు నెమ్మదిగా దూరం అవుతూవుంది.   వెనక్కి వెళ్ళిపోదామన్న కోరికను మరొక్కసారి బలవంతంగా అణచిపెట్టి ముందుకే నడక సాగించాడు.                                                                                                                        కుటుంబానికి వీడ్కోలు చెబుతున్నప్పటి నుండి అడ్డుకట్ట వేసి వుంచిన,  కన్నీరు ఒక్కసారిగా కట్టలు తెంచుకొని జల జలా పారింది.  ఆ చలిలో  కన్నీటితో తడిసిన షర్ట్,   గుండెకు వెచ్చగా తగులుతుంటే - గొంతు మాత్రం గుటక కూడా వేయలేనంతగా పొడిబారిపోయింది.                                                                                                                               అప్పుడే ఆరు నెలలు అయిపోయింది ప్రకాష్ కు హైద్రాబాద్ కు ట్రాన్స్ ఫర్ అయి.  కూతురు టెంత్ క్లాస్ కావడం తో,   ఆమె చదువుకు ఇబ్బందని కుటుంబాన్ని ఇక్కడేవుంచి ప్రకాష్ అటు ఇటూ తిరుగుతున్నాడు.  ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో ఇంటికి వచ్చి చూసుకొని, కావాల్సిన సరుకులు ఇతర సదుపాయాలు సమకూర్చి వెళుతుంటాడు.  అతని ఉద్యోగం క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చే విభాగమే అయినా, ప్రకాష్ పరిస్థితి తెలిసిన అక్కడి ఆఫీస్  వారు కొంచెం వెసులుబాటు ఇస్తూ వుంటారు.                                                                                                          కుమార్తె అర్ధం చేసుకొన్నా, బాగా చిన్న వాడయిన   చింటూ మాత్రం  తండ్రి ఎడబాటుకు ఇంకా అలవాటు పడడం లేదు.  కొత్తలో చింటూ నిద్రపోయిన తరువాత ఊరికి బయలుదేరేవాడు.    తరువాత తరువాత ప్రకాష్ వచ్చినప్పుడు   చాలా రాత్రి అయినాగాని నిద్రపోయేవాడు కాదు,   ఎక్కడ వాళ్ళ నాన్న వెళ్ళిపోతాడోనని.  అప్పటి నుండి చింటూని సరిపుచ్చి హైద్రాబాద్ బయలుదేరేటప్పటికి తల ప్రాణం తోకకొచ్చేస్తోంది.                                                                       " ఈ ఒక్క లోజు వుండు నాన్న"   అని వెళ్ళే ముందర బుంగమూతి పెట్టి అర్ధిస్తుంటే ఎలా బుజ్జగించాలో తెలియక సతమతమౌతుంటాడు.  ఇక నాన్న వెళ్ళక తప్పదు అని నిర్ధారణకు వచ్చినప్పుడు మాత్రం   "తొందలగా వచ్చేయే"   అని  పదే  పదే  చెబుతూ వీడ్కోలు చెపుతాడు.   ప్రకాష్ బస్ ఎక్కగానే ఫోన్ చేయాలి,  దాని కోసమే నిద్రపోకుండా ఎదురుచూస్తుంటాడు చింటూ.   " ఏ సీ బస్సా..? మామూలు బస్సా..?, టీవీ పెట్టాలా..?" అని కుశల ప్రశ్నలు వేసిన తరువాత    "తొందలగా వచ్చేయే.." అని పాత పాటే ఎత్తుకుంటాడు.
                                                                        మరి ఈ రోజెందుకో చాలా పేచీ పెట్టాడు.  మెడ కావళ్ళించుకొని వదల్లేదు,  బలవంతంగా విడిపించుకొంటే కాళ్ళకు అడ్డంపడి  కదలనివ్వలేదు.   పోనీ ఈ రోజుకు ఆగిపోదామా అంటే,   అప్పటికే ఒక రోజు అధికంగా వున్నాడు.   ఆఫీస్ లో కూడా పని ఎక్కువగా వుంది.  వెళ్ళక తప్పదు.   భార్య, కూతురు ఎంతో ప్రయాసపడితేగాని  చింటూని  ఇంట్లోకి తీసుకెళ్ళలేక పోయారు.                                                                                                                   బస్ ఎక్కగానే ఫోన్ చేసాడు.     దానికోసమే ఎదురుచూస్తున్న చింటూ " నాన్నా.. ఇప్పులే వచ్చేయ్..ఇప్పులే వచ్చేయ్ నాన్నా.."  అంటూ ఒకటే ఏడుస్తున్నాడు.    పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో ఆపుకుంటూ, మౌనంగా రోధించాడు తప్ప బదులు పలకలేకపోయాడు.   "నాన్న..! తమ్ముడు  ఫోన్ ఇచ్చేసి దిండులో తలపెట్టులొని ఏడుస్తున్నాడు"  అని కుమార్తె   జాలిగా చెప్పింది.   ఇంతలో ఫోన్ అందుకున్న భార్య  " కాసేపు ఆగితే అలాగే నిద్రపోతాడు,  ఉదయానికి మాములుగానే వుంటాడ "ని   భరోసా ఇచ్చేప్పటికి కొద్దిగా   తేలికపడ్డాడు   ప్రకాష్.
                                                                       ప్రకాష్ అలా కళ్ళు మూసుకున్న కొద్దిసేపట్లోనే  బస్   మరో స్టేజ్ లో ఆగింది.   ముగ్గురో నలుగురో  ప్రయాణీకులు ఎక్కారు.  వారిలో ఒకతను ప్రకాష్ వెనుక విండో సీటులో కూర్చున్నాడు.  ఎక్కిన కొద్దిసేపటికే   అతను ఫోన్  మాట్లాడడం  ప్రారంభించాడు.  అప్రయత్నంగా ఫోన్ స్పీకర్ ఆన్ కావడంతో  " డాడీ! నన్ను,మమ్మీని  కూడా నీతో తీసుకెళ్ళు..మేము వచ్చేస్తాం"  అని చిన్న పాప స్పష్టంగా అంటూ  ఏడుస్తుండడం   వినిపించింది.    ఆ వ్యక్తి పాపను బుజ్జగిస్తున్నాడు.   దానితో  ప్రకాష్ కు   చింటూ మాటలు మళ్ళీ తలపుకు వచ్చాయి.
                                                                              నిద్రపోతున్నాడో,  ఇంకా ఏడుస్తున్నాడో..?   ఫోన్ చేస్తే పోలా?   వద్దులే.. ఒక వేళ నిద్రపోతే మళ్ళీ  లేచి  పేచీపెడతాడు అని,   ఆ  ఆలోచన  విరమించుకున్నాడు.   వెనుక వ్యక్తి ఫోన్ సంభాషణలో పాస్ పోర్ట్, ఎయిర్ పోర్ట్ అని పదే పదే పలుకుతుండడంతో ఏదో విదేశీ ప్రయాణానికి వెళుతున్నట్లున్నాడు  అనుకుంటూ   నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు    ప్రకాష్.

            *                *             *            *            *          *             *          *            *           *

                       ఒక్క కుదుపుతో  బస్ ఆగడంతో తుళ్ళిపడి లేచాడు   ప్రకాష్.     "గువ్వ.. గోరింకతో... "     చిరంజీవి సినిమాలోని పాట స్పీకర్ బాక్స్ లలో నుండి పెద్ద సౌండ్ తో వినిపిస్తుండడంతో ప్రయాణీకుల నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది.     సమయం చూస్తే 1.30 ని. అయింది .   టీ  తాగడానికి బస్ ను హైవే ప్రక్క దాబా హోటల్ ముందు ఆపాడు డ్రైవర్.   ప్రకాష్ కు బస్ దిగబుద్ది కాకున్నా,  చలిగా వుండడంతో టీ తాగుదామని దిగాడు.   టీ కప్ తీసుకొని కొంచెం ఇవతలికి రాగా,   అక్కడ ఒంటరిగా నిలబడి సిగరెట్  కాలుస్తూ కనబడ్డాడు  తన వెనుక సీట్ లోని వ్యక్తి.  అతని కళ్ళు బాగా వుబ్బి, ఎర్రగా వున్నాయి.   నిద్రపట్టలేదనుకుంటా..బాగా ఏడ్చినట్టుగా  కూడా కనిపిస్తున్నాడు.                                                                      ఎప్పుడూ రిసర్వుడ్ గా వుండే ప్రకాష్ కొంత చొరవగా " ఏదైనా విదేశీ ప్రయాణానికి వెళుతున్నారా..?"  అని అతనితో మాట కలిపాడు.   "అవునండీ..! కువైట్ వెళుతున్నాను. అక్కడ ఒక కంపెనీలో తెలిసిన బంధువుల ద్వారా వుద్యోగం దొరికింది" అని  బదులిచ్చాడు అతను.     "రాత్రి మీరు  ఫోన్ మాట్లాడుతున్నప్పుడు  మీ పాప అనుకుంటా బాగా ఏడుస్తుంది.   బయటకే వినిపించింది. మా బాబు కూడా రాత్రి అలాగే గోల పెట్టాడు " అని అతనిని  అడగడానికి గల కారణం చెప్పాడు.   అలాగే  తనగురించి  కూడా  అతనికి  చెప్పుకొచ్చాడు ప్రకాష్.                                                                                                                                                                                                                 ఆ వ్యక్తిది   గన్నవరం  అని,   హైవే విస్తరణలో వున్న ఒక్కగానొక్క కిరాణా షాప్ పోగా,  ఆ వచ్చిన డబ్బులు అప్పులకు,  కుటుంబ ఖర్చులకు కరిగిపోయినట్లు,  ఎటూ పాలుపోని పరిస్థితులలో తెలిసిన వారి ద్వారా ఈ విదేశీ ఉపాది పొందినట్లు అతని మాటల వల్ల తెలిసింది.
                                                    " మా పెళ్ళైన చాలా కాలానికి పుట్టింది పాప.   నా చిట్టి తల్లికి ఊహ తెలిసిన నాటి నుండి ఏ ఒక్క రోజు నేను విడిచి వుండలేదు.  ఈ మధ్య పాస్ పోర్ట్,    వీసా పనుల మీద తిరుగుతూ వుండడం వలన ఇంటికి  చేరెటప్పటికి  లేటవుతుండేది.  రాత్రి ఏ సమయమైనా నేను వచ్చే దాకా నిద్రపోకుండా ఎదురుచూసేది.   అలాంటి నా బంగారు తల్లిని మూడు సంవత్సరాలు చూడకుండా ఎలా వుండగలను..?   నా చిట్టి తల్లి ఎలా వుంటుంది..?"   అని వల వలా విలపించాడు.
                                                                           "చూడండి. నాకు ట్రాన్స్ ఫర్ వచ్చి నిన్నో, మొన్నో అయినట్లుంది.   అప్పుడే సంవత్సరం అయిపో వస్తుంది.  రోజులు ఎంతో వేగంగా గడచి పోతాయి.  మీకు  కూడా మూడు సంవత్సరాలు ఇట్టే కరిగిపోతాయి.   మీరైనా, నేనైనా కుటుంబానికి  దూరంగా గడపాల్సి వస్తుందంటే   కారణం మన వాళ్ళ మంచి భవిష్యత్ కోసమే కదా..?   మీరు తెచ్చే ఆర్ధిక భద్రతతో  ఇకపై  జీవితాంతం కుటుంబానికి దగ్గరగా వుంటూనే ఏదో ఒక ఆసరా చూసుకోవచ్చు"    అని ఓదార్చాడు ప్రకాష్.                                                                                                                                               సాధారణంగా మనిషి తనకున్న సమస్యలే భరించలేనివని తలచుకొని మరి మరి బాధపడుతుంటాడు.  ఎప్పుడైతే తనకంటే సమస్యలు, కష్టాలు ఎక్కువగా వున్నవారిని ప్రత్యక్షంగా చూస్తాడో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్  తెచ్చుకుంటాడు.   ఇప్పుడు ప్రకాష్ పరిస్థితి అలానే వుంది.   అతనితో పోల్చుకుంటే తన పరిస్థితి ఎన్నో రెట్లు బెటర్.   ప్రకాష్ లో నూతనోత్సాహం తొణికిసలాడింది.  బస్ బయలుదేరడంతో అందరూ తమ సీట్లలో సర్దుకున్నారు.   చలి బాగా పెరిగింది.  బస్ స్పీడ్ అందుకుంది.                                                                   
    *       *       *       *       *        *      *       *      *       *      *        *           *         *          *          *

                                  సమయం తెల్లవారి 4 గంటలు కావొస్తుంది.   తెల్లవారుజామునే నిద్ర లేచె అలవాటున్న - ముందు సేటులోని  పెద్దాయన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సెల్ ఫోన్ లోని పాత పాటలు వింటున్నాడు.                                                                మరో గంటన్నరలో బస్ తన గమ్యస్థానం చేరేదే...అన్నీ సవ్యంగా జరిగితే...                                              ఆ బస్ కన్నీరును తుడుస్తున్నాయా అన్నట్లుగా అద్దాలపై కురుస్తున్న మంచుధారలను స్వై పర్స్ క్లీన్ చేస్తున్నాయి.   నిద్ర మగతతో మూతలు పడబోతున్న రెప్పలను బలవంతంగా ఆపుచేసుకుంటున్న డ్రైవర్, ఎదురుగా ఆగివున్న లారీని గమనించలేదు.    గమనించేలోపే ఘోరం జరిగిపోయింది.                                                                       ఇయర్ ఫోన్స్ ఎక్కడికో ఎగిరిపోవడంతో ఫోన్లోని పాట బయటకు వినిపిస్తుంది.                                                            "ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక..ఏ దారెటుపోతుందో ఎవరినీ అడగక..."    

4 వ్యాఖ్యలు:

  1. మనిషి అన్నాక అందరికీ ఏదో ఒక సమస్య... బాగుంది కధ.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ఈ తొలి కథ ను అభిమాన కవితా సాహిత్య సామ్రాజ్ణి చదివి అభినందించడం... ఆహా ఏమి ఈ భాగ్యమూ...

    ప్రత్యుత్తరంతొలగించు
  3. It's not a story... It's true. Many people are staying away from their families due to their studies and carrier, that's very difficult. But, ending is so sad��

    ప్రత్యుత్తరంతొలగించు

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...