18, మార్చి 2018, ఆదివారం

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?


జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లికట్టు ఆట నిషేధానికి కేంద్ర స్థాయిలో నిషేదాజ్ఞలు జారీ అయ్యాయి.  పర్యవసానం ఏమయ్యింది..?  తమిళ ప్రజలంతా  ఒక్కటయ్యారు.  చంటి పిల్లలు మొదలుకొని సెలబ్రిటీల వరకు, సామాన్య ప్రజల నుండి మేధావుల వరకు అందరూ ఏకమయ్యారు.  తమ సంప్రదాయ క్రీడ పై నిషేధం విధిస్తే..  అది తమ సంస్కృతి, సంప్రదాయాల మీద జరిగిన దాడిగానే భావించవలసి వుంటుందని అంతాకలసి రాష్ట్రాన్నే స్థంబింపజేసారు.  ఎంతో ప్రభావ వంతమైన జీవ కారుణ్య పరిరక్షణ సంస్థలు,  న్యాయ, కార్య నిర్వాహక వ్యవస్థలు  ఈ వుద్యమాన్ని పరిగణనలోకి  తీసుకొని తమ విధానాలను సమీక్షించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.   తమ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ మాత్రం భంగం కలిగినా తాము కుల, మత, వర్గ, లింగ భేధలు లేకుండా అంతా ఒక్క తాటి పై నిలబడి ఎంత తీవ్రంగా స్పందిస్తారో కేంద్రానికి  తెలియచెప్పారు.  కేంద్రం మెడలు వంచి, వున్న చట్టాలను సవరించి, అనువైన ఆర్డినెన్స్ లు ప్రవేశ పెట్టేలా చేసి,  జల్లికట్టు కు ఎటువంటి ఆటంకాలు లేకుండా చేసుకోవడం ద్వారా పై చేయి సాధించారు తమిళ ప్రజలు.   ఒక సంప్రదాయ క్రీడ విషయమై రేగిన అలజడికి తక్షణమే స్పందించి,  పరిస్థితులు చేయి దాటిపోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకున్న కేంద్రం -  అసహాయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యవసర ఆక్సిజన్ లాంటి "ప్రత్యేక హోదా"  పై ఎందుకింత నిర్లక్ష్యం చూపిస్తుంది..?  నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఇందులో కేంద్రం తప్పేమీ లేదు.  మన ప్రక్క రాష్ట్రం ఒక ఆట కోసం అంతగా తెగువ చూపించి సాధించుకుంటే,  రాష్ట్ర జీవనాధార హక్కు సాధించుకోవడానికి పార్టీలు గాని,   ప్రజానీకంగాని ఆ స్తాయిలో స్పందించలేదు అన్నది వాస్తవం.  ఇక రాజకీయ పార్టీల విషయానికి వస్తే  అధికార, ప్రధాన పార్టీ  తెలుగుదేశం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం వుండి కూడా ప్రత్యేక హోదా పై గట్టిగా నిలదీయలేక పోయింది.   ఇన్నాళ్ళ అన్యోన్య దాంపత్యం అనంతరం ప్రజాగ్రహాన్ని గుర్తించి రాజకీయ విడాకులు తీసుకొని,   ఒప్పంద బంధాన్ని గౌరవించి ఈ పాపాలను భరించాను గాని,   తప్పంతా బిజెపి దే అని తన రాజకీయ విధానాన్ని సమర్ధించుకో చూస్తుంది.   ప్రత్యేక హోదా సాధ్యపడే విషయం కాదని అధికారంలోకి వచ్చిన కొత్తలోనే  కేంద్రం తేల్చి చెప్పినా, ఇన్నాళ్ళు కలసి కొనసాగడం తమ తప్పిదమేనని చంద్రబాబు ఒప్పుకొని వుంటే ఎంతో హుందాగా వుండేది.   ఇక ప్రధాన ప్రతిపక్షం వై యస్ ఆర్ సి పి మొదటి నుండి ప్రత్యేక హోదా పై గళం విప్పుతున్నా..   అది "అశ్వత్థామ అతహ్ కుంజరహ"   రీతిలోనే కొనసాగిస్తు వస్తున్నారు.   గట్టిగా నినదిస్తే ఇప్పుడిప్పుడే స్నేహ హస్తాన్ని చాస్తున్న మోడీ చెయ్యిస్తారేమో అన్న సంశయం కారణం కావొచ్చు.  ప్రత్యేక హోదా ఇతర విభజన హామీలు అమలుకు భరోసా ఇచ్చింది  టిడిపి - బిజెపి ద్వయమే కాబట్టి,  అవి అమలులో విఫలమైతే ప్రజలలో చులకన అయ్యేది వారే కదా..!  అది మా పార్టీకి లాభమే కదా..!   అన్న విధానంలోనే జగన్ ఆలోచిస్తూ వస్తున్నారు.   అంతే తప్ప "ప్రత్యేక హోదా" వంటి వజ్రాయుధాన్ని నాలుగేళ్ళుగా నిరుపయోగంగా ఒరలో పెట్టుకు తిరుగుతున్నానన్న విషయాన్ని విస్మరించారు.   అవసరమైతే తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని జగన్ ఎప్పుడో ప్రకటించారు.   ఆనాడే ఆ పని చేసి వుంటే ఈనాడు రాష్ట్రంలో జగన్ ఒక ప్రభంజనమై నిలిచే వారు. పదవీకాలం ముగుస్తున్న ఈ తరుణంలో రాజీనామాలు చేయించినా అంత ప్రాధాన్యం ఏముంటుంది..?   ఇక జనసేన ది కూడా ఇలాంటి తంతే.   పవన్ షూటింగ్ విరామ సమయాలలో అడపదడపా సభలు పెట్టి,  ప్రత్యేక హోదా పై ప్రజలు వుద్యమించాలని వుద్భోధించడమే గాని,   ప్రత్యక్ష కార్యచరణ కార్యక్రమాలు చేపట్ట లేదు.  ఒక ప్రక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు ..  రెండిటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలియక పవన్ ఈ నాలుగేళ్ళు సతమత మయ్యారు.   ఇప్పటి నుండి పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయించడానికి నిశ్చయించుకున్నా,  రాష్ట్రం కోసం వుద్యమించే చాలా విలువైన కాలాన్ని  ఆయన   కోల్పోయారు. మేము అధికారం లోకి వస్తే "ప్రత్యేక హోదా" ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ నెత్తి,  నోరు కొట్టుకున్నా  ఆంధ్ర ప్రజలు వారిని ఇప్పటికీ అనుమానాస్పదంగానే చూస్తున్నారు.   రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా గత నాలుగేళ్ళుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్నది   "ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి"   మాత్రమే కనిపిస్తున్నది.   సమైఖ్యాంధ్ర వుద్యమంలో కూడా కీలక పాత్ర వహించిన ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్,  మరికొంత మంది వివిధ రంగాలకు చెందిన పెద్దలు నిరంతర పోరాటం చేస్తున్నారు.   ప్రధాన రాజకీయ పార్టీలు, మీడియ  నుండి తగిన సహకారం, ప్రోత్సాహం లభించకపోవడంతో వారి శ్రమ తగిన గుర్తింపుకు నోచుకోబడలేదు.    ప్రత్యేక హోదా విషయమై  పార్టీలన్నీ తమ జెండాలను ప్రక్కన పెట్టి,   ఒకటే అజెండాతో  పోరాడాలని ప్రత్యేక హోదా సాధన సమితి ఎప్పటినుండో చెపుతున్నా  ఈ పార్టీల చెవికెక్కలేదు.   ఇప్పటికైనా పార్టీలు అన్నీ (బిజెపి తప్పించి)  ప్రత్యేక హోదాపై తీవ్ర స్థాయి వుద్యమానికి సిద్దమవుతుండడం శుభపరిణామం.   కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వున్నా ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చేలా వుద్యమించాల్సిన భాద్యత ఆంధ్ర ప్రజల భుజస్కంధాలపైనే వుంది. 
   

2 వ్యాఖ్యలు:

  1. జల్లికట్టులో ఆంబోతులు మనుషులని కుమ్ముతాయి. పెత్యేక హోదాలో రాజకీయ ఎద్దులు పజానీకాన్ని కుమ్మి కుమ్మి వదిలేస్తాయి అన్నట్టు.

    ప్రత్యుత్తరంతొలగించు

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...