27, సెప్టెంబర్ 2017, బుధవారం

అలుపెరుగని ఆంధ్రుడు చలసాని శ్రీనివాస్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉదృత ఉద్యమ సమయంలో- పార్టీలకు అతీతంగా సమైఖ్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వారిలో ముఖ్యులు చలసాని శ్రీనివాస్. ఆ ఉద్రిక్త పరిస్థితులలో ఆయన ఎన్నో భౌతిక దాడులను ఎదుర్కొన్నారు. నిరంతరం సామరస్యపూర్వక పంథాలోనే సమైఖ్య రాష్ట్ర ఆవశ్యకతపై వివిధ సభలు, సమావేశాలు, చర్చా వేదికల ద్వార గళం వినిపించిన మేధావి. ఈ సందర్భంలో కొన్ని వేల పుస్తకాలను , లక్షలలో పత్రాలను స్వంత ఖర్చుతో ముద్రించి, పంపిణీ చేశారు. పలుమార్లు తమ బృందంతో ఢిల్లీ వెళ్ళి ఆనాటి అన్ని పార్టీల అగ్ర నాయకులను కలసి ఉద్యమానికి మద్దతు కూడ గట్టే ప్రయత్నాలు చేసారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు తదుపరి ప్రొ. కోదండరాం  పరిస్థితిలానే, నూతన ఆంద్రప్రదేశ్ లో చలసాని సేవలు విస్మరించబడ్డాయి. నాటి చలసాని బృందంలోని వారిలో అధిక శాతం వివిధ రాజకీయ పార్టీల పంచన చేరి రాజకీయ ఆశ్రయం సంపాదించుకోగా, ఈయన మాత్రం విభజన హామీల అమలు సాదనకై అలుపెరుగని పోరాటానికే సిద్దమయ్యారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి, విశాఖ ప్రత్యేక రైల్వే జోన్, మారుమూల గిరిజన గ్రామాలలో అనారోగ్య సమస్యలు, అగ్రిగోల్డ్ భాదితుల పక్షాన...ఇలా నిరంతరం రాష్ట్ర సమస్యలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృస్టికి తెచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేస్తుంటారు.    నాటి విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ ను రాష్ట్రం నుండి పూర్తిగా తుడిచిపెట్టాలని పిలుపునిచ్చి, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు భరోసాను ఇచ్చిన బిజెపి కు మద్దతు పలికారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలు విస్మరించిందని ప్రస్తుతం  బిజెపిపై కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. చలసాని మిత్రులు, అభిమానులలో బిజెపి సానుభూతిపరులు అధికంగా ఉన్నాసరే, బిజెపి ని దునుమాడడంలో వెనుకంజ వేయడం లేదు. ఈ ముక్కుసూటి తనమే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికలలో చలసాని వంటి ఆలోచనపరుడు, మేధావి సేవలను వినియోగించుకోవడంలో సందేహపడేటట్లు చేస్తుందంటున్నారు రాజకీయ నిపుణులు. "రాష్ట్ర ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం" అని నమ్మిన సిద్ధాంతం కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్న చలసాని శ్రీనివాస్ వంటి నిబద్దత గల వ్యక్తుల అవసరం ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో వుంది. అధికారంలో ఏ పార్టీ వున్నా రాజకీయాలకు అతీతంగా ఇటువంటివారి సేవలను వినియోగించుకోవాలి.       

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...