13, ఆగస్టు 2017, ఆదివారం

ప్రొ. కబడ్డి నేర్పుతున్న పాఠం

మానసిక, శారీరక ఉల్లాసాన్నిచ్చే - అచ్చమైన గ్రామీణ క్రీడ కబడ్డి.  భారత  గ్రామీణ యువత వారసత్వ సంపద కబడ్డి. క్రికెట్ మోజులోపడి  జాతీయ క్రీడ హాకి వంటి క్రీడలే ఉసూరంటుంటే.. మరి కబడ్డి వంటి పల్లె క్రీడల పరిస్థితి ఎలా వుంటుంది..?  అనాదిగా పొటీలు నిర్వహిస్తున్న కొన్ని సంఘాలు పండుగలు, ప్రత్యేక సందర్భాలలో జరిపే పోటీలు  తప్ప  మరి ఎటువంటి ఆదరణ వుండేది కాదు.  భారత వుపఖండంలో పురుడుపొసుకున్న క్రీడ కావడంచేత ఆసియా దాటి అంతర్జాతీయంగా  ఈ ఆట ప్రాచుర్యం పొందలేక పోతుంది.  ఎప్పుడైతే కార్పొరేట్ కన్నుపడి ప్రొ.కబడ్డి రూపుదిద్దుకొందో అప్పుడే ఈ పల్లెటూరి ఆట దశ తిరిగింది.  2014లో ప్రారంభమైన ఈ లీగ్ అంతకంతకు ప్రాచుర్యం పొందుతూ భారీ స్తాయిలో విజయవంతం అయ్యింది.  ఈ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలు ప్రాంతీయ చానల్స్ లో, ప్రాంతీయ భాషలలో ప్రసారం జరుగుతున్నపటినుండి  మరింతగా పాపులర్  అయ్యింది. వీక్షకాదరణ కారణంగా గత సంవత్సరం  రెండుసార్లు నిర్వహించారంటే  పరిస్థితి  అర్ధం చేసుకోవచ్చు.  ప్రొ. కబడ్డి స్టార్ ఆటగాళ్ళు రాహుల్ చౌదరి, అనూప్ కుమార్, మంజిత్ చిల్లర్, దీపక్ నివాస్ హుడా, పరదీప్ నర్వాల్ తదితరులు ఈ రోజు  ఫేమస్ సెలెబ్రిటీలు. టెండూల్కర్  కంటే కూడా  రాహుల్ చౌదరి నేడు తెలుగు కుటుంబాలలో పాపులర్. రాహుల్ ని హీరొగా పెట్టి తెలుగు సినిమా తీయడానికి లోగడ గట్టి ప్రయత్నాలే జరిగాయి.  కబడ్డి క్రీడకు అందిస్తున్న సహకారంలానే గ్రామీణ చేతి వృత్తులకు, వ్యవసాయానికి, కళలకు, అనుబంద పరిశ్రమలకు కార్పొరేట్  ప్రపంచం సహకారం అందిస్తే దేశ ముఖ చిత్రమే మారిపొతుంది. పవన్ కల్యాణ్, సమంతలు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్స్ గా వుంటామన్నరు. ఈ ప్రభుత్వాలు వారి సేవలను ఎంత వరకు వినియోగించుకున్నాయి..?   అరకులో పండించే కాఫీకి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వుంది.  ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఎంత మంది మనలో వినియోగిస్తున్నారు? ఏ ప్రాంతాలలో అందుబాటులో వుంది?  నాంది ఫౌండేషన్ అనే స్వచ్చంద సంస్థ అక్కడి గిరిజనులకు కాఫీ పండించడంలోను, మార్కెటింగ్, పంపిణీ, పరిశోదనలలో దన్నుగా నిలుస్తుంది.  అదే కార్పొరేట్ సహకారం లభిస్తే తెలుగు కాఫీ రుచులు విశ్వ వ్యాప్తంగా గుబాలించడంతోపాటు గిరిజనుల కుటుంబాలలో వెలుగులు మరియు రాష్త్రానికి మంచి ఆదాయ మార్గం అవుతుంది.  స్వచ్చత, స్వదేశీ నినాదంతో అనతి కాలంలోనే వేల కోట్ల రూపాయల వ్యాపార స్థాయికి చేరుకొని- విదేశీ సంస్థలకే వ్యాపార సూత్రాలను నేర్పుతున్నది "పతంజలి" సంస్థ.   మరి మన గిరిజన సహకార సంస్థ వారి వుత్పత్తులు పతంజలి వుత్పత్తులలానే  ఎంతో విశిష్టమైనవి. కావాల్సిందల్లా ప్రచారము, ప్రోత్సాహము. ప్రభుత్వ హస్తకళల సంస్థ లేపాక్షిని కార్పొరేట్ సహకారంతో పరిపుష్టం చేసి ఏటి కొప్పాక, కొండపల్లి కొయ్య బొమ్మలకు జీవం పోయవచ్చు. డ్వాక్రా మహిళా సంఘాల వారికి కార్పొరేట్ సహకారంతో పచ్చళ్ళు, పొడులు, పిండి వంటలు తదితర తయారీలలో శిక్షణ, మార్కెటింగ్ వంటి అంశాలు నేర్పించి ఒక బ్రాండ్ ద్వారా వారి ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించవచ్చు. ఏది ఏమైనా, తాము ఎదుగుటకు సహకరించిన సమాజానికి ఎంతో కొంత సాయం అందించాలన్న ఆలోచన బడా కార్పొరేట్ సంస్థలకు వుండాలి.  అలాగే అటువంటి సంస్థలని గుర్తించి, ఈ విధానంలో ప్రోత్సహించి, పర్యవేక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వాలపైనా వుంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...