15, ఆగస్టు 2017, మంగళవారం

ప్రశాంత్ కిషోర్ తో ఒప్పందం చేసుకుంది జగనా? చంద్రబాబా?


ఆశ్చర్యం లేదు. ఎన్నికల ఎత్తుగడల నిపుణుడిగా దేశవ్యాప్త ఖ్యాతి గడించిన ప్రశాంత్ కిషోర్ ను  రాబోవు ఎన్నికలలో విజయ ప్రణాళికలు రచించడానికి జగనే తమ పార్టీ వ్యూహకర్తగా నియమించుకున్నారు.  ప్రశాంత్ రావడం, రావడం తన మార్క్ సర్వేలతో రంగంలోకి దూకేసారు.  పనిలో పనిగా నంద్యాల ఉప ఎన్నిక కూడా తోడవడంతో, తన వ్యూహాస్త్రాల పదును పరీక్షించుకోవడానికి మంచి వేదిక దొరికింది.  ఆయన సూచనల మేరకే జగన్ ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయి వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  విరుచుకుపడుతున్నారు. ఎన్నికల సంఘం నోటీసులు జారి చేసినా, జగన్ ఏ మాత్రం వెనుకకు తగ్గడం లేదు. నిరంతరం జగన్,  వైసిపి గురించి  ప్రజలు,  మీడియ చర్చించుకొనేల చేయడమే  ప్రశాంత్ ఈ వ్యూహానికి  కారణమని విశ్లేషకులు అంటున్నారు.  ప్రస్తుత పరిస్తితులలో ఈ విధానం సరైనదేనా..?  వైసిపికి ఎంతవరకు మైలేజ్ ఇస్తుంది..?  ప్రశాంత్ వ్యూహాలు వైసిపికి మేలు చేస్తున్నాయా..? కీడు చేస్తున్నాయా..?  ఒకసారి విశ్లేషించుకుందాం.    చిన్న స్థాయి ప్రాంతీయ పార్టీ నుండి,  బిజెపి, కాంగ్రెస్ పార్టీల వరకు ప్రతి పార్టీకి తెర వెనుక  చిన్నదో,  పెద్దదో మేధావుల బృందం వుంటుంది. ఇందులో సిద్ధాంత కర్తలు, వ్యూహకర్తలు,  సలహాదారులు,  విశ్లేషకులు వుంటారు.  వీరు ఎప్పుడూ తెర వెనుక వుండి మంత్రాంగం నడిపించడమేగాని,  స్టేజ్ పై ఏ పాత్ర పోషించరు.  ప్రశాంత్ రాక సందర్భంగా జరిగిందేమిటి..?  ఒక స్టార్ ఫాలోయింగ్ వున్న నటుడో,  క్రీడాకారుడో  పార్టిలోకి వస్తున్నట్లుగా  ఆర్భాటం జరిగింది.  చాపకింద నీరులా జరగాల్సిన వ్యవహారాన్ని అత్యుత్సాహంతో  పందిరి వేసి, పటాసులు కాల్చి హడావుడి చేసినట్లయ్యింది.  సాదారణంగా వ్యూహకర్తలు హంగు, ఆర్భటాలకు చాలా దూరంగా వుంటూ  తమ మంత్రాంగంలో తలమునకలై వుంటారు.  అది వారి వృత్తి లక్షణం.  దేశంలోని ప్రముఖ వ్యూహకర్తతో అనుబంధం ఏర్పడిన ఆనందంలో జగన్ తమ పార్టీ ప్లీనరీ వేదికపైకి  ప్రశాంత్ ను ఆహ్వానించి,  ప్రాధాన్యత ఇచ్చి వుండవచ్చు.  కాని,  ఒక రాజకీయ మంత్రాంగ నైపుణ్యం కలిగిన వ్యక్తిగా- ఇది సరి అయిన  విధానం  కాదని జగన్ కు సున్నితంగా చెప్పాల్సిన భాద్యత ప్రశాంత్ పై వుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది..? ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేక భావనలు వెలుగుచూస్తున్నయని  మదనపడుతున్న టిడిపి శ్రేణులకు  ప్రశాంత్ కిషోర్  రూపంలో ఒక మంచి అవకాశం చిక్కినట్లయ్యింది.  ఇక నుంచి ప్రశాంత్ కనుసన్నల్లోనే  జగన్ వ్యవహరిస్తారని,  ప్రశాంత్ సర్వేల్లో చాల మంది సిట్టింగ్ లకు చాన్స్ లు గల్లంతవుతున్నాయని, జగన్ తరువాత నెంబర్ టూ గా పార్టీ పగ్గాలు చేపట్టబోయేది ప్రశాంత్ యేనని మైండ్ గేం స్టార్ట్ చేసాయి టిడిపి శ్రేణులు. వైసిపిలో ఉద్ధండ పిండాలు ఎన్నో వున్నా,  నెంబర్ టూ స్థానం ఖాళీగానే వుంటుంది.   విజయమ్మ,  షర్మిళలు వున్నప్పటికి- వారు ఎన్నికలు మరియు ముఖ్య సమావేశాలలో తప్ప కనిపించకపోవడం ఈ వ్యాఖ్యలకు ఊతం ఇస్తున్నాయి.  ఈ విధమైన వాతావరణం వలన పార్టీలో సీనియర్లను కూడా కాదని ప్రశాంత్ బృందం చుట్టు కోటరి ఏర్పడే ప్రమాదం వుంది.  పార్టీకి ఇది ఎంతవరకు మేలు చేస్తుంది..?  మరో ముఖ్య విషయం.   వైసిపి నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొనేల చేయడం ఎంతవరకు సబబు..?   ఇది కేవలం ఒక ఎమెల్యే మరణించడంతో వచ్చిన ఉప ఎన్నిక మాత్రమే.   వివిధ కారణాల వల్ల, కొన్ని సీట్లలో ఉప ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే పార్టీల ట్రెండ్ తెలుస్తుంది.   ఏదో ఒకటి రెండు స్థానాల్లో ప్రాతినిధ్య సభ్యులు మరణించిన చోట్ల జరిగే ఎన్నికలను రిఫరెండంగా ఎలా భావిస్తారు..?   ఇటువంటి చోట్ల చనిపోయిన వ్యక్తి కుటుంబానికే సీటు కేటాఇంచడం,   వారు గెలవడం అన్నది సర్వసాధారణంగా జరిగేదే.   ఇప్పుడు నంద్యాల వుప ఎన్నిక కూడా అటువంటిదేగా..?    సానుభూతికి తోడు, అధికార పార్టీ కావడం మరింత అదనపు లాభం టిడిపి అభ్యర్ధికి.  ఈ ఉప ఎన్నిక వాస్తవానికి టిడిపికే ప్రతిష్టాత్మకంగాని,   వైసిపికి ఎంత మాత్రం కాదు.  ఈ ఎన్నికను ఒక సవాల్ గాను,  2019 ఎన్నికలకు సెమీ ఫైనల్ గాను భావించేలా చేయడం,  జగన్ ను నంద్యాలలోనే మకాం పెట్టించడం ప్రశాంత్ వ్యూహాత్మిక   తప్పిదంగా కనిపిస్తుంది. రేపు ఎన్నికలో విజయం సాధిస్తే వైసిపికి అద్భుతమైన మైలేజ్ వస్తుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.  ప్రశాంత్ కు కూడా మంచి గౌరవం దక్కుతుంది.   ఇంతా చేసి ఫలితం ప్రతికూలంగా వస్తే, ఈ ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రభావం చూపించే అవకాశాలు పుష్కలంగా వుంటాయి.  ఇప్పుడు ఈ ఎలక్షన్ ను మేము ప్రతిష్టాత్మకంగా తీసుకోలేదు అనే అవకాశం వైసిపికి లేదు.   సరి కదా, ఖచ్చితంగా టిడిపి శ్రేణులు  ప్రశాంత్ ఎత్తుగడలు అన్ని వుత్త ఢాంభికాలుగా ఎద్ధేవ చేస్తాయనడంలొ మరో మాట లేదు.  ఇప్పుడిప్పుడే అధికార పక్షం నుండి ప్రతిపక్షం వైపు దూకడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న " జంపింగ్ జపాంగ్ " లు తమ నిర్ణయంపై పునరాలోచన చేసుకొనే పరిస్తితి వస్తుంది.   ప్రచారంలో భాగంగా జగన్ చేత తీవ్ర వ్యాఖ్యలు చేయించడం కూడా వివాద్స్పద వ్యూహంగా మారిపోయింది. ఒక లక్ష్యం కోసం చేసే వుధ్యమాలకు ఈ తరహా మాటలు చెల్లుతాయి కాని, రాజకీయ ప్రయోజనం ముడిపడిన ఎన్నికలలో ఆమోదయోగ్యం పొందడమన్నది కొంచెం ఇబ్బందికరమైనదే. ఇందుకు ఒక మంచి వుదాహరణ తెలంగాణ సిఎం కేసీఅర్.   వుద్యమ సమయంలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన కెసీఅర్ తదుపరి ఎన్నికల క్షేత్రంలో ప్రసంగాలలో వచ్చిన మార్పును స్పష్టంగా తెలుసుకోగలం.  ఏది ఏమైనా  ప్రస్తుత పరిస్థితిబట్టి చూస్తే ప్రశాంత్ కిషోర్ వ్యవహారం కోరి తెచ్చుకున్న కొరివి కాదుకదా అని పార్టీ వాళ్ళే అనుకునేలా వుంది.         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...