11, మార్చి 2018, ఆదివారం

"మాతృదేవోభవ"...హాలంతా శోక వెల్లువ

అది 1992-93 కాలం.  అత్తెసరు చదువుతో.. అద్భుత భవిష్యత్ కోసం.. ఆరాటపడుతూ...   ఆప్త మితృడు భయ్యా( మా ఇంటి అనధికార దత్తపుత్రుడు)తో జీవనపోరాటం ప్రారంభించిన కాలం.  ఇరవయ్యేళ్ళు మించని ప్రాయంలో ఒక వైపు చేతులు కాల్చుకుంటూ ... అప్పుడప్పుడు కడుపు కాల్చుకుంటూ..  ఎక్కువగా కాళ్ళీడ్చుకుంటూ  విశాఖ మహానగరాన్ని అపురూపంగా చూస్తూ గడిపేస్తున్న అందమైన, అమూల్యమైన రోజులు.  మేము ఏపాట్లు పడుతున్నామో (సహజ బ్యాచిలర్ కోతి చేష్టలు అలవడ్డాయేమో కనుక్కుందామన్న మిష కూడా కావచ్చు) అని కొత్తలో ఒకసారి నాన్న వచ్చారు.   ఇంటిగల వారు, ఇతర పక్క కుటుంబాల వారు మాపై మంచి అభిప్రాయాన్ని వెలిబుచ్చడంతో నాన్న సంతోషపడ్డారు.  ఆయనకు, మాకు కొద్దిగా సినిమా పిచ్చి వుండడంతో ఒక ఆధివారం జగదాంబ థియేటర్ కు తీసుకువెళ్ళాం.   దానిలో అప్పటి నలుగురు అగ్ర కథానాయకులలో ఒకరి చిత్రం నడుస్తున్న గుర్తు.  టిక్కెట్స్ అయిపోవడంతో  బ్లాక్ లో ఒక టికెట్ సంపాదించి ఆయనను పంపించాం. ఆయన వచ్చేవరకు వుండాల్సిందే కదా అని చుట్టుపక్కల థియేటర్స్ చూస్తే ఒక దానిలో (వెంకటేశ్వర థియేటర్ అని గుర్తు) "మాతృదేవోభవ"  ఆడుతుంది.   నాజర్, మాధవి హీరో, హీరోయిన్స్.  అంత ఆసక్తి లేకున్నా ఏదో కాలక్షేపం చేయాలన్న వుద్దేశ్యంతో టికెట్స్ తీసుకొని వెళ్ళికూర్చున్నాము.   సినిమా ప్రారంభమయ్యే సమయానికి థియేటర్ ఫుల్ అయిపోయింది.   75 శాతం మహిళా ప్రేక్షకులే వున్నారు.   సినిమా మొదలైన కొద్ది సేపటికే మహిళలు ఏడుస్తుండడం చూసి "భలే సినిమాకు వచ్చాములే" అని నవ్వుకున్నాము.  ఇంటెర్వల్ కు చూస్తే ఆడవాళ్ళకన్నా మా మితృలిరువురమే ఎక్కువగా ఏడ్చినట్టు గమనించాం . సినిమా అయిపోయిన తరువాత, నీళ్ళతో ముఖం కడుక్కొని బయటకు వచ్చినట్టు బాగా గుర్తు.  నాజర్, మాధవి, తనికెళ్ళ భరణి అద్భుతంగా నటించారు.  మరీ ముఖ్యంగా మాధవి, ఆమె పిల్లలుగా నటించిన బాల నటులు ఆ పాత్రలలో జీవించారు. " రాలిపోయె పువ్వా నీకు రాగాలెందుకే", "వేణువై వచ్చాను భువనానికి" ఈ రెండు పాటలు ఎప్పుడు విన్నా గుండెల్లో ఏదో తెలియని బాధ వెలుపలకు వస్తుంది.  వూహ తెలిసిన తరువాత ఇంతగా ఏడ్పించిన చిత్రం మరొకటి లేదు.  ఈ సినిమా చాలా అవార్డ్స్ పొందడంతో పాటు, కమర్షియల్ గా కూడా మంచి సక్సెస్ ను సాధించింది.  ఈ చిత్రం ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాటి సంఘటన గుర్తొచ్చి నవ్వుకుంటాము.   

2 కామెంట్‌లు:

"జల్లికట్టు" కంటే కూడా "ప్రత్యేక హోదా" తీసికట్టా..?

జల్లిజట్టు.. ఒక క్రీడ..అందులోనూ మూగ జీవాల హింసతో కూడిన వినోద కాలక్షేపం.  జంతు హింస తీవ్రత ఎక్కువగా వుందన్న కారణంగా తమిళనాడులో జల్లిక...